పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ 'పుట్టా' కృతజ్ఞతలు
పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ 'పుట్టా' కృతజ్ఞతలు
-- రైతులు అదనంగా పండించిన పొగాకును ఎలాంటి పెనాల్టీ లేకుండా వేలం కేంద్రాల్లో అమ్ముకునేందుకు ఉత్తర్వులు
-- రూ.50 వేల చొప్పున వడ్డీ లేని రుణంపై కూడా నోటిఫికేషన్
ఢిల్లీ/ఏలూరు, మేజర్ న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీగా తాను చేసిన విజ్ఞప్తులు, రైతుల ఇబ్బందులు అర్థం చేసుకుని అదనపు పొగాకు అమ్మకాలకు అనుమతి ఇస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పొగాకు రైతుల తరపున కేంద్ర ప్రభుత్వానికి, పొగాకు బోర్డుకు ఎంపీ కృతజ్ఞతలు తెలియచేశారు. ఈమేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ, పొగాకు బోర్డు గతంలోనే అంగీకరించిన విధంగా బార్న్‌కు రూ.50 వేల చొప్పున వడ్డీ లేని రుణానికి ఆమోదం తెలపడంతో పాటు, 2025-26 పంట కాలంలో అదనపు పొగాకు విక్రయాలకు అనుమతి ఇస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పొగాకు బోర్డులో నమోదైన డీలర్లు, వ్యాపారులు ఎలాంటి పెనాల్టీలు, ఇబ్బందులు లేకుండా సాధారణ సర్వీస్ ఛార్జీలు చెల్లించి పొగాకును వేలం ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతించింది. దీనితోపాటు బార్న్‌కు రూ.50 వేల చొప్పున వడ్డీ లేని రుణం నిర్ణయం వల్ల దాదాపు 44 వేల మంది రైతులకు రూ.220 కోట్ల వరకూ ఉపశమనం కలుగుతుందని ఎంపీ వెల్లడించారు.
ఈ సందర్భంగా సెప్టెంబర్ 13న పొగాకు రైతులు, రైతు సంఘాల నేతలు తనను కలిసి బోర్డు నిర్దేశించిన కోటాకు మించి పండిన పంటను కూడా వేలం కేంద్రాల్లో విక్రయించేందుకు అనుమతి ఇప్పించమని కోరిన విషయాన్ని, దీనిపై రైతులకు హామీ ఇచ్చిన మేరకు తాను కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తో, అధికారులతో మాట్లాడిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. తనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రితో, అధికారులతో మాట్లాడిన ఫలితంగానే తాజా ఉత్తర్వులు వెలువడ్డాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.
వీటితో పాటు పొగాకు రైతులకు ఆర్దిక ఉపశమన చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ పథకం కింద లో గ్రేడ్, ఆఫ్ గ్రేడ్ రకాలకు కిలోకి రూ.10 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చి, దీనికోసం 94 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతర్జాతీయ పరిమాణాల కారణంగా, కొద్ది నెలలుగా పొగాకు మార్కెట్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొందన్న ఎంపీ, ప్రస్తుతం మార్కెట్ ధరలు రోజురోజుకూ మెరుగుపడి ఇప్పుడు యార్డులో పొగాకు కొనుగోలు ధర కేజీ 345 వరకూ చేరిందని, రాబోవు రోజుల్లో మరి కొంత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అదనపు పొగాకు అమ్మకాలకు అనుమతి ఇస్తూ కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిన పొగాకు రైతు సంఘం నేతలు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఫోన్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా పొగాకు రైతులకు ఇబ్బందులు వచ్చినప్పుడల్లా నేనున్నానంటూ ముందుకు వచ్చి, రైతులకు న్యాయం జరిగేలా కేంద్ర మంత్రుల వద్ద, పొగాకు బోర్డులో రైతుల తరపున గట్టి వాదన వినిపిస్తూ అండగా నిలుస్తున్న ఎంపీకి పొగాకు రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.