దసరా వేళ భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం
దసరా వేళ భక్తుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం
దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్
ఇంద్రకీలాద్రి, అక్టోబర్ 4, మేజర్ న్యూస్ ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును పరిశీలించిన ఆయన, ఇటీవల భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించి చేపడుతున్న రక్షణ చర్యలను సమీక్షించారు. దేవాదాయ శాఖ తాజాగా జారీ చేసిన ఆదేశాల అమలుపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాబోయే దసరా ఉత్సవాల సందర్భంగా భక్తుల రక్షణే పరమావధిగా తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయి పరిశీలన కమిటీ చేసిన సిఫార్సులను కచ్చితంగా అమలు చేస్తూ పనులను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. తాత్కాలిక రక్షణ చర్యలతో పాటు భవిష్యత్తులో కొండచరియలు విరిగిపడకుండా శాశ్వత పరిష్కార మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. నిర్దేశించిన రక్షణ చర్యలు పూర్తయిన వెంటనే వాటికి సంబంధించిన సమగ్ర నివేదికను దేవస్థానం నుంచి సమర్పించాలని కమిషనర్ రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.