చురుగ్గా మురసు తుఫాను సహాయక చర్యలు చేపట్టిన రెవెన్యూ, పోలీస్ బృందం
- జోరు వానలో సైతం క్షేత్ర స్థాయిలోనే తహశీల్దార్ చంద్రశేఖర్, ఎస్సై వెంకటయ్యలు, సిబ్బంది.
నాదెండ్ల మేజర్ : న్యూస్ :గత రాత్రి నుండి మురసు తీవ్ర తుఫాను ప్రభావంతో మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం, దానికి గాలుల వేగం తోడవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తహశీల్దార్ చంద్రశేఖర్, ఎస్సై వెంకటయ్యలు ఇద్దరు సీనియర్ అధికారులు కావడంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తుఫాను ప్రభావం మొదలుకాకముందే ముందస్తు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కింది స్థాయి సిబ్బందిని కూడా ఎక్కడికక్కడ మోహరించి అందుబాటులో ఉంచారు. దీంతో తుఫాను సహాయక చర్యల్లో ఎక్కడా ఆలస్యం లేకుండా, సత్వరమే పనులు జరిగేలా ఏర్పాట్లు చేసి ప్రజల మన్ననలను పొందుతున్నారు. ఇందులో భాగంగా ఉదయం వీచిన గాలులకు పలు గ్రామాల పరిధిలో చెట్లు కూలిపోగా జోరువానలో సైతం ఆ ప్రదేశాలకు చేరుకుని క్రేను సాయంతో, కూలీలను వెంట బెట్టుకుని పడిపోయున చెట్లను తొలగించారు. మరికొన్ని చోట్ల కాలువలు పొంగి రోడ్డుపై నీరు ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడగా హుటాహుటిన అక్కడకు చేరుకుని కాలువకు మరమ్మతులు చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చేశారు. వాగులు ఉన్న ప్రాంతాల్లో ఇరు శాఖలు తమ సిబ్బందిని ఉంచి ముందస్తు చర్యలు చేపట్టారు. నాదెండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సాతులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సహా మండలంలోని పలు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని, పక్కా నివాస గృహాలు లేనివారిని గుర్తించి ముందుగానే వారిని ఆ కేంద్రాలకు తరలించి, సిబ్బందిని కేటాయించి వారికి కావలసిన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా మండలంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి సిబ్బంది నిరంతరం పనిచేస్తూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. కాగా, ఇప్పటికే మండలంలో అధిక వర్షపాతం నమోదు కాగా, రానున్న గంటల్లో అంతకు రెట్టింపు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.