చిన్నారి వైద్యానికి మంత్రి సుభాష్ మానవతా హస్తం అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మహిశ్రీకి ఆర్థిక సాయం
రామచంద్రపురం మేజర్ న్యూస్ :అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మానవతా దృక్పథంతో అండగా నిలిచారు. పేద కుటుంబానికి చెందిన చిన్నారి వైద్యానికి అవసరమైన రెండు ఖరీదైన ఇంజక్షన్లను సమకూర్చి, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు మానసిక ధైర్యాన్ని అందించారు.రామచంద్రపురం రూరల్ మండలం అన్నయ్యపేటకు చెందిన దవల వెంకటేశ్వరరావు, కరుణ జ్యోతి దంపతుల కుమార్తె మహిశ్రీ అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్ వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు చికిత్సలో భాగంగా ప్రతినెల రెండు ఖరీదైన ఇంజక్షన్లు అవసరమని సూచించారు. ఒక్కో ఇంజక్షన్ సుమారు రూ.22 వేల వరకు ఖర్చవుతుండటంతో, పేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.చిన్నారి పరిస్థితిని కూటమి పార్టీ నాయకులు సలాది శ్రీను ద్వారా తెలుసుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ వెంటనే స్పందించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని మానవతా కోణంలో అర్థం చేసుకుని, తన వంతు సహాయం చేయాలని ముందుకొచ్చారు. వైద్యానికి అవసరమైన రెండు ఇంజక్షన్లను 44 వేలుతో కొనుగోలు చేసి చిన్నారి కుటుంబానికి అందించారు.
అంతేకాకుండా, భవిష్యత్తులో కూడా వైద్యానికి అవసరమైన సహాయం అందిస్తానని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. “ఆందోళన చెందవద్దు.. నేనున్నాను” అంటూ చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి, వారి కష్టకాలంలో అండగా నిలిచారు.ఆపదలో ఉన్న కుటుంబాలకు కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, వారి బాధను తన బాధగా భావించి, వారికి మానసిక ధైర్యాన్ని కల్పించడం మంత్రి సుభాష్ సేవా దృక్పథానికి నిదర్శనమని కూటమి పార్టీ నాయకులు పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి పట్ల మంత్రి సుభాష్ చూపిన మానవత్వం, ఆప్యాయత, సేవాభావం పట్ల మహిశ్రీ తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి, తమ చిన్నారి వైద్యానికి సహాయం చేసిన మంత్రి సుభాష్‌ను వారు అభినందించారు.
మంత్రి సుభాష్ వెంట జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, రూరల్ మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు పెంకే సాంబశివరావు, సలాది శ్రీను తదితరులు ఉన్నారు.