చిన్నారికి కొత్త కుటుంబాన్ని అందించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు కలెక్టరేట్,.మేజర్ న్యూస్ : నగరంలోని శిశుగృహంలో సంరక్షణ పొందుతున్న చిన్నారికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కొత్త కుటుంబాన్ని అందించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ద్వారా చిన్నారిని తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దంపతులకు చిన్నారికి సంబంధించిన దత్తత ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దత్తత తీసుకున్న చిన్నారికి ప్రేమానురాగాలతో కూడిన కుటుంబ వాతావరణాన్ని కల్పించాలని దంపతులకు సూచించారు. చిన్నారికి మంచి విద్యను అందిస్తూ, నైతిక విలువలతో పెంచి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. చిన్నారుల సంరక్షణ, భద్రత, పునరావాసంలో చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. కుటుంబ ఆదరణకు దూరమైన చిన్నారులకు ప్రేమ, ఆప్యాయతలతో కూడిన కుటుంబ జీవితాన్ని అందించడంలో దత్తత ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్. నాగ శైలజ, జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్, శిశుగృహ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.