చైన్ స్నాచర్ల ముఠా అరెస్టు -13 దోపిడీలలో 57 లక్షల 352 గ్రాముల బంగారు స్వాధీనం
ఎడ్యుకేషన్ స్టాప్ రిపోర్టర్ : తిరుపతి జిల్లాలో ఇటీవల కాలంలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్‌లకు పోలీసులు చెక్ పెట్టారు. జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 13 చైన్ స్నాచింగ్ కేసులను చేధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తిరుచానూరు పరిధిలో 8, రామచంద్రాపురం పరిధిలో 4, వడమాలపేట పరిధిలో 1 కేసు నమోదు కాగా, వీటన్నింటినీ పోలీసులు ఒకేసారి చేధించారు. నిందితుల నుంచి 57 లక్షల విలువైన సుమారు 352 గ్రాముల బంగారు ఆభరణాలు (12 బంగారు చైన్లు నేరాలకు ఉపయోగించిన మూడు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఈ వరుస చైన్ స్నాచింగ్‌లను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, జిల్లా క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీలత పర్యవేక్షణలో చంద్రగిరి డీఎస్పీ జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తో పాటు క్రైమ్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా తిరుచానూరు సిఐ సునీల్ కుమార్, ఎస్సైలు సుధాకర్, ఈశ్వర్, సిద్దారెడ్డి, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ సీఐ భక్తవత్సలం, క్రైమ్ సిబ్బందికి అందిన సమాచారం మేరకు, తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దామినీడు వద్ద సోమవారం ముగ్గురు వ్యక్తులను అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులు ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని, మోటార్ సైకిళ్లకు పదే పదే అనుమానం రాకుండా నంబర్ ప్లేట్లను మార్చి నేరాలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. చెడు వ్యసనాలకు బానిసై, వాటిని తీర్చుకోవడం కోసం నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఏర్పేడు రామా పరానికి చెందిన చల్ల రాజేష్ 26, రేణిగుంట వెదల్లచెరువుకు చెందిన బొందే శివరామకృష్ణ అలియాస్ శివ 27, మేకల కిషోర్ 36, ఏర్పేడు మాధవమాలకు చెందిన చిత్తూరు పవన్ కళ్యాణ్ అలియాస్ పవన్ 27, లను పోలీసుల అరెస్టు చేశారు. వారిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇంకా ఏదైనా నేరాలలో పాల్గొన్నారా అన్నది పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ సందర్భంగా ఒంటరిగా వెళ్లే మహిళలు తమ ఆభరణాల పట్ల తగు జాగ్రత్త తీసుకోవాలని, ఎవరైనా పదే పదే తమను వెంటాడుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే 112కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్