భక్తిశ్రద్ధలతో ఇరుముడి కట్టిన అయ్యప్ప స్వాములు
పొదలకూరు, మేజర్ న్యూస్ : అయ్యప్ప స్వామి శరణుఘోషలతో పొదలకూరులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శబరిమల యాత్రకు సిద్ధమైన అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో ఇరుముడి కట్టించుకున్నారు. స్థానిక కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం సుమారు 40 మంది భక్తులు గురుస్వాముల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు.అయ్యప్ప దీక్షలో ఇరుముడికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఇరుముడి కేవలం పూజా సామగ్రి మూట మాత్రమే కాకుండా భక్తుడి భక్తి, త్యాగం, ఆత్మశుద్ధి, సంపూర్ణ శరణాగతికి ప్రతీకగా భావిస్తారు. ఇందులో మున్ముడిలో స్వామివారికి సమర్పించే నెయ్యి కొబ్బరికాయ, బియ్యం, పూజా ద్రవ్యాలను, పిన్ముడిలో యాత్రకు అవసరమైన వస్తువులను ఉంచుతారు.ఇరుముడిలో అత్యంత పవిత్రమైన నెయ్యి కొబ్బరికాయలోని నెయ్యితో అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించడం విశేషం. ఇది అహంకారాన్ని విడిచిపెట్టి ఆత్మను భగవంతునికి సమర్పించడానికి ప్రతీకగా భక్తులు విశ్వసిస్తారు. ఇరుముడి ధరించిన స్వాములకే శబరిమలలోని 18 పవిత్ర మెట్లను అధిరోహించే అర్హత ఉంటుంది.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఇరుముడి ధరించిన స్వాములు శబరిమల యాత్రకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.