భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలు
ఆనందపురం సూర్య: ఆనందపురం మండలం బోని గ్రామంలో నాగుల చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం శుక్ల పక్ష చవితి రోజున జరుపుకునే ఈ పవిత్ర పండుగ సందర్భంగా బోని గ్రామం శివాలయం ఉదయం నుంచే భక్తి వాతావరణం నెలకొంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. మహిళలు తెల్లవారుజాము నుంచే నాగ దేవత ఆలయ పుట్టల వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నాగదేవతకు పాలు పోసి, గుడ్లు, పసుపు, కుంకుమ, పూలు, చలిమిడి, వడపప్పులతో పూజలు చేశారు. తమ పిల్లల ఆరోగ్యం, సౌభాగ్యం, కుటుంబ క్షేమం కోసం మొక్కులు తీర్చుకున్నారు. పురాణ ప్రాధాన్యత.. పురాణాల ప్రకారం నాగుల చవితి రోజున నాగ దేవతను పూజిస్తే సంతాన దోషాలు, కాలసర్ప దోషాలు, నాగ దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాల్లో భక్తుల రద్దీ.. ఈ సందర్భంగా శివాలయంలో గల నాగ దేవత ఆలయమును రంగు రంగుల పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.ప్రసాధాలు కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పుట్టల వద్ద పూజలు కొనసాగాయి. భక్తుల నామస్మరణతో, మంగళ వాయిద్యాలతో బోని గ్రామంలో ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి.