బాపట్ల జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాము : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల, మేజర్‌న్యూస్ :
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ బాపట్ల జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కేంద్ర బృందం పర్యటన, ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా తయారి అంశాలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో గురువారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి దశలో పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు, బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల మండలానికి ఎన్నికల నిర్వహిస్తామని కలెక్టర్ చెప్పారు. ఇదే క్రమంలో బాపట్ల మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయన్నారు. రెండో దశలో వేమూరు, చీరాల నియోజకవర్గాలకు ఎన్నికలు జరుపుతామన్నారు. మూడో దశలో రేపల్లె నియోజకవర్గంలోని మండలాలు, బాపట్ల నియోజకవర్గంలో మిగిలిపోయిన మండలాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. నామినేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల అధికారులను నియమిస్తామన్నారు. తదుపరి ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని నియమిస్తామన్నారు. 400 ఓట్లకు పైగా ఉన్న పోలింగ్ కేంద్రానికి వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, నిఘా ప్రక్రియ ఆధార్ నోడల్ అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ఎంపీపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికలు సమర్థంగా నిర్వహించడానికి, ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన ఎన్నికల సామగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. నిధుల అవసరతపై జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి అంచనాలపై నివేదిక పంపాలన్నారు. బ్యాలెట్ బాక్స్ ల అవసరతపై నివేదిక ఇవ్వాలన్నారు. బాపట్ల మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని కమిషనర్ ను ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు వచ్చిన ఉద్యోగులకు భోజనం, అల్పాహారం, తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆర్డిఓలదేనన్నారు. మరుగుదొడ్లు వసతి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులలో ఉండే అధికారులు, ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. కనీస సౌకర్యాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలననుసరించి పారితోషకాలు ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు పక్కాగా అమలు చేయాలన్నారు. విధుల్లో ఉండే ఉద్యోగులకు అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా ప్రతి ఒక్కరికి పారితోషకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. *ఎవరికైనా పారిపోషకం రాకపోతే జిల్లా కలెక్టర్ ఫోన్ కు నేరుగా వాట్సాప్ లో సమాచారం అందించవచ్చన్నారు. ఎన్నికలు సమర్ధంగా నిర్వహించడానికి ఉద్యోగులంతా కృషి చేయాలన్నారు. మంచిగా పని చేసి, మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఎన్నికల విధులకు గైర్హాజరైతే వారిపై కచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, జిల్లా పంచాయతీ అధికారిని నగేష్ కుమారి, సిపిఓ షాలేమురాజు, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు హరికుమార్, నరసింహారావు, శ్రీదేవి, ఎం డి ఓ లు, తహసిల్దార్లు, బి ఎల్ ఓ లు, తదితరులు పాల్గొన్నారు.