ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులు క్లియర్
అరకులోయ, నవంబర్ 13, మేజర్ న్యూస్:
తుఫాను దాటికి దెబ్బతిన్న అరకులోయ ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనులు క్లియర్ అయింది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇక్కడి గాలికొండ, బీసుపురం ఘాట్ రోడ్డు మలుపు వద్ద గల రక్షణ గోడ కూలిపోయింది. దీంతోపాటు రహదారి అంచుల్లోని మట్టి పూర్తిగా జారిపోయి లోయలోకి పడింది.తుఫాను కారణంగా అస్తవ్యస్తంగా తయారైన ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.మూడు వారాల క్రితం సంభవించిన ఈ సంఘటనపై స్పందించిన హైవే ఇంజనీరింగు అధికారులు యుద్ధ ప్రాతిపదికన దెబ్బతిన్న ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు. రాత్రింబవళ్లు పనులు చేసి రక్షణ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు మట్టి జారిపడి లోతైన ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి మట్టి పోసి లైన్ ను క్లియర్ చేశారు. మరమ్మత్తు పనులు చేపట్టాక ముందు హైవే ఇంజనీరింగ్ అధికారులు తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేసి తేలికపాటి వాహనాల రాకపోకలకు అనుమతించారు. అప్పటినుండి రెండు వారాలపాటు భారీ వాహనాలైన ఆర్టీసీ బస్సులు,లారీలు,వ్యాన్లు వంటివి ఈ మార్గంలో ప్రయాణించకుండా ఆంక్షలు విధించారు.భారీ వాహనాల రాకపోకలను నిషేధించడంతో ప్రయాణీకులు, పర్యాటకులు,వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా నిత్యావసర సరుకులు దొరకక సామాన్య కుటుంబాలు నానా
అవస్థలు పడ్డారు.ఓ పక్క ప్రజలు పలు ఇక్కట్ల పాలవ్వగా,ఏపీఎస్ఆర్టీసీ కి మాత్రం భారీ నష్టం వాటిల్లింది.కరోనా మహమ్మారి తర్వాత తుఫాను కారణంగా మళ్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఘాట్ రోడ్డు మరమత్తు పనులు పూర్తి కావడంతో మరో రెండు రోజుల్లో ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని హైవే అథారిటీ ఇంజనీరింగు అధికారి సురేష్ కుమార్ విలేకరులకు తెలిపారు. అయితే పునరుద్ధరణ పనులు పూర్తయినట్టు తెలుసుకున్న కొంతమంది రాత్రి సమయంలో భారీ వాహనాలతో రాకపోకలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. తేలికపాటి వాహనాల రాకపోకలు మాత్రం యధావిధిగా జరుగుతున్నాయి.ప్రైవేటు వాహన యజమానులు మాత్రం ప్రజల సౌకర్యార్థం అరకులోయ నుంచి శృంగవరపుకోట వరకు టికెట్ సర్వీసులు చేపట్టారు.