అర్నబ్‌గా మారిన తీవ్ర వాయుగుండం… బుధవారం బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం
విజయవాడ, మేజర్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడిందని, దీనికి ‘అర్నబ్’గా నామకరణం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం ఉదయం 8.30 గంటల సమయానికి తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందన్నారు. ప్రస్తుతం విశాఖపట్నానికి 650 కి.మీ., కాకినాడకు 730 కి.మీ., మచిలీపట్నానికి 830 కి.మీ., బాపట్లకు 910 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా, మంగళవారం అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. బుధవారం ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని పేర్కొన్నారు. రానున్న మూడు రోజులు అత్యంత కీలకమని, ప్రజలు అప్రమత్తంగా ఉండి విపత్తుల నిర్వహణ సంస్థ సూచించిన జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని ప్రఖర్ జైన్ సూచించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.