ఆ పిలుపుతో మాకేం సంబంధం....!
షాద్ నగర్…..
*కోన్ కిస్కా గాళ్ల పిలుపు.. మాకెందుకీ అదుపు..?*
*తెలంగాణ ఉద్యమకారుల అరెస్టు సరికాదు..*
*ఉద్యమ నేతలు పి. వెంకట్రాం రెడ్డి, జర్నలిస్ట్ కేపీ, ఉద్యమ నేత పినపాక ప్రభాకర్ ఆగ్రహం..*
*ఎవడో పిలుపునిస్తే మాకేమిటి సంబంధం..*
*ఉద్యమకారుల కోసం పనిచేస్తుంటే అరెస్టులా..?*
*పోలీసుల వైఖరి మారాలి..*
తెలంగాణ ఉద్యమంలో నిరంతరం పోరాడి రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ఉద్యమకారులు నేడు తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాడుతున్న సమయంలో, ఎవరో ఇచ్చిన పిలుపుతో సంబంధంలేని ఉద్యమకారులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి. వెంకట్రాంరెడ్డి, షాద్‌నగర్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు పినపాక ప్రభాకర్, సీనియర్ జర్నలిస్ట్ కేపి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమకారుల పేరుతో ఎవరో ఇచ్చిన పిలుపునకు తమను అరెస్టు చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం అనంతరం గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, ఉద్యమకారులకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఆచార్య కోదండరాం నేతృత్వంలో, కాంగ్రెస్ నేత కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసే స్థాయికి ఉద్యమం చేరిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారులకు న్యాయం జరిగేలా జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుతంగా పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడామని, ప్రస్తుతం ఉద్యమకారులంతా ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. తమ ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ మొదలుపెట్టిందని దీనికి సంబంధించి కమిటీకి కూడా తమ వంతు బాధ్యతగా సూచన సలహాలు అందజేస్తున్నామని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన లేకుండా, ఎవరో ఇచ్చిన పిలుపు ఆధారంగా ఉద్యమకారులను అరెస్టు చేయడం సరికాదని వారు అన్నారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశామని తెలిపారు. దీనిపై ఆదివారం ఉద్యమకారుల సమావేశం కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థులు, యువత, జర్నలిస్టులు కలిసి పోరాడారని వారు గుర్తుచేశారు. రాష్ట్ర సాధన కోసం నాడు ఐక్యంగా ఉద్యమించిన వారంతా నేడు కూడా అదే ఐక్యతతో ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ఎవరో ఇచ్చిన పిలుపుతో అరెస్టుల పేరుతో ఉద్యమకారులను వేధించడం సరికాదని వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వారు పేర్కొన్నారు.
జావ్వాజి రాఘవేందర్ గౌడ్, మేజర్ న్యూస్