అప్పీళ్లలోనూ అభ్యర్థులకు తీరని అన్యాయం..! -ఆర్డీఓ కార్యాలయం వద్ద రోజంతా అభ్యర్థుల నిరీక్షణ
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
చంద్రగిరి నియోజక వర్గంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల తిరస్కరణ వ్యవహారంలో అభ్యర్థులకు కష్టాలు వీడటం లేదు. నామినేషన్ల పరిశీలనలో అన్యాయం జరిగిందంటూ అప్పీళ్లు చేసుకున్న అభ్యర్థులకు విచారణ సమయంలోనూ నిరీక్షణ తప్పడం లేదు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం లో సోమవారం మండలాల వారీగా అప్పీళ్లపై విచారణ చేపడుతుండగా.. ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అభ్యర్థులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా తిరుపతి రూరల్ మండలానికి చెందిన అభ్యర్థులను ఆర్డీఓ కార్యాలయం లోపలికి పోలీసులు అనుమతించకుండా అడ్డుకోవడంపై అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పీళ్ల విచారణకు వచ్చిన అభ్యర్థులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చిన అభ్యర్థులకు కనీస అవకాశం కూడా కల్పించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.చెవిరెడ్డి జోక్యంతో పోలీసులు అనుమతించగా అభ్యర్థులు ఆర్డీఓ కార్యాలయం లోపలకు చేరుకున్నారు.
కనీస సౌకర్యాలూ కరువే..
అప్పీళ్ల విచారణకు వచ్చిన అభ్యర్థులకు ఆర్డీఓ కార్యాలయం లోపల కనీస సౌకర్యాలు లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చినట్టు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి ఉండేందుకు కూర్చోవడానికి కుర్చీలు, కనీసం తాగేందుకు మంచి నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వాదనలు విని.. నిర్ణయం చెప్పకుండా..
అప్పీళ్లకు వచ్చిన అభ్యర్థులు, వారి తరఫున వచ్చిన న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నా.. ఆర్డీఓ వాటిని విని స్పష్టమైన నిర్ణయం వెల్లడించకుండా పంపిస్తున్నారనే విమర్శలు అభ్యర్థుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
అభ్యర్థులకు చెవిరెడ్డి కుటుంబం అండ
న్యాయం కోసం అప్పీళ్లను ఆశ్రయించిన అభ్యర్థులకు చెవిరెడ్డి కుటుంబం అండగా నిలుస్తోంది. చంద్రగిరి నియోజక వర్గం పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు, తిరుపతి రూరల్ జడ్పిటీసీ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు నామినేషన్ల తిరస్కరణలో జరిగిన పరిణామాలపై అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తూ న్యాయపోరాటానికి సహకరించారు. అప్పీళ్లలోనూ తమకు న్యాయం జరగకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని బాధిత అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో తమకు జరిగిన అన్యాయంపై న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.
H. Dwaraka, staff reporter
9705347341