అనంతలో టపాకాయల దందా.. మామూళ్ల మోత! ఒక్కో దుకాణానికి రూ.60 వేల వసూలు?
అనంతపురం క్రైమ్ మేజర్ న్యూస్ : అన్ని అనుమతులు ఉన్నా.. మామూలు చెల్లిస్తేనే ప్రవేశం! గేటు వద్దే అక్రమ వసూళ్ల ఆరోపణలు.. పోలీసుల సమక్షంలోనే దందా సాగుతోందంటున్న బాధితులు! అనంతపురంలో టపాకాయల విక్రయాల వెనుక భారీ మామూళ్ల దందా నడుస్తోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రజల భద్రత కోసం నిబంధనలు పాటిస్తూ, సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన వ్యాపారులు సైతం అదనపు వసూళ్ల బారిన పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో టపాకాయల దుకాణానికి రూ.60 వేల చొప్పున మామూలు చెల్లించాల్సిందేనని, లేదంటే దుకాణాల ప్రాంగణంలోకి అడుగుపెట్టనివ్వబోమని కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారంటూ బాధిత వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.60 వేలు ఇస్తేనే ప్రవేశమా?
టపాకాయల విక్రయాలకు సంబంధించి రెవెన్యూ తదితర సంబంధిత అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ, ఇక్కడి వసూళ్ల వ్యవహారం వ్యాపారులకు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఒక్కో దుకాణానికి రూ.60 వేలు చెల్లిస్తేనే లోపలికి అనుమతిస్తామని, లేదంటే అనుమతి లేదంటూ అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు ఒకవైపు ఉంటే, మరోవైపు మామూళ్ల అనుమతి తప్పనిసరైందా? అంటూ వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.
పన్నెండు గంటల గడువు.. రూ.30 వేలకే సిద్ధం!
తమకు కేవలం పన్నెండు గంటల సమయం మాత్రమే ఉందని, ఇంత తక్కువ వ్యవధిలో రూ.60 వేలు సమకూర్చడం సాధ్యం కాదని బాధితులు వాపోతున్నారు. కనీసం రూ.30 వేలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అంగీకరించడం లేదని ఆరోపిస్తున్నారు. వ్యాపారం ప్రారంభించకముందే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తే తాము ఏం సంపాదించాలని ప్రశ్నిస్తున్నారు.
గేటు వద్దే వసూళ్ల పర్వం!
పోలీసులు విధుల్లో ఉన్న గేటు సమీపంలోనే తమను అడ్డుకుని డబ్బులు వసూలు చేస్తున్నారన్నది బాధితుల ప్రధాన ఆరోపణ. పోలీసుల సమక్షంలోనే ఈ వ్యవహారం సాగుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు ఈ వసూళ్ల విషయం తెలుసా? తెలిసి కూడా పట్టించుకోవడం లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.
ఏటా కోటి రూపాయల మామూళ్లా?
ప్రతి సంవత్సరం టపాకాయల విక్రయాల సమయంలో ఇదే తరహా వసూళ్లు జరుగుతున్నాయని, జిల్లావ్యాప్తంగా మొత్తం కలిపి సుమారు కోటి రూపాయల మేర అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తానికి సంబంధించి అధికారిక లెక్కలు, ఆధారాలు వెలుగులోకి రావాల్సి ఉంది. వసూళ్ల వెనుక ఎవరున్నారు? ఎవరికి వాటాలు వెళ్తున్నాయి? ఈ వ్యవహారానికి అండగా నిలుస్తున్నది ఎవరు? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఉన్నతాధికారులు స్పందించాలి.. బాధితులకు న్యాయం చేయాలి!
ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం చేసుకునే వారికి అక్రమ వసూళ్ల బెడద లేకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. టపాకాయల విక్రయాల ప్రాంగణంలో వసూళ్లకు పాల్పడుతున్న వారిని గుర్తించి, ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని బాధిత వ్యాపారులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తక్షణమే స్పందించి గేటు వద్ద జరుగుతున్నట్లు చెబుతున్న వసూళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
వ్యాపారులకు అనుమతులు ఇచ్చేది ప్రభుత్వమా? లేక మామూళ్లు వసూలు చేసేవారా? అన్న ప్రశ్నకు అధికారులే సమాధానం చెప్పాలి!