అనకాపల్లిలో కార్పొరేట్ ఎన్నికలకు సర్వం సిద్ధం.
89 పోలింగ్ కేంద్రాలు, సీసీ నిఘా.
నవంబర్ 1న పోలింగ్, 3న కౌంటింగ్.
అనకాపల్లి, అక్టోబర్ 28, మేజర్ న్యూస్: అనకాపల్లిలో జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులతో జోనల్ ఆఫీస్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. మొత్తం 89 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన రూట్ ప్లాన్లను అభ్యర్థులకు వాట్సాప్ ద్వారా అందించనున్నారు. అత్యంత సమస్యాత్మకమైన (హైపర్ సెన్సిటివ్), సమస్యాత్మకమైన (సెన్సిటివ్) పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 31న పోలింగ్ సిబ్బంది అందరూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు రానున్నారు. సిబ్బంది రవాణాకు ఎన్టీఆర్ స్టేడియంలో బస్సులు ఏర్పాటు చేశారు. నవంబర్ 1న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టారు. నవంబర్ 3, 2026న ఉదయం 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని అభ్యర్థులకు సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. పోటీ చేయు అభ్యర్థుల స్పెసిమెన్ సంతకాలు తీసుకున్నారు. సమావేశంలో ఇద్దరు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు, పోటీ చేయు అభ్యర్థులు, పోస్టల్ బ్యాలెట్ సిబ్బంది, జోనల్ కమిషనర్ సమక్షంలో ఖాళీ పోస్టల్ బ్యాలెట్ బాక్సులను చూపించి సీల్ చేశారు. మొత్తం 160 పోస్టల్ బ్యాలెట్లను నవంబర్ 3న జరిగే ఓట్ల లెక్కింపులో ముందుగా లెక్కించనున్నారు. 79 పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన అప్లికేషన్లను ఇప్పటికే పోస్టల్ ద్వారా పంపించడం జరిగిందని, వాటి అక్నాలెడ్జ్ మెంట్లు తమ వద్ద ఉన్నాయని అధికారులు వివరించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు జోనల్ కమిషనర్ కే.చక్రవర్తి తెలిపారు.