అంబాజీపేటలో మిణుకు మిణుకు విద్యుత్ దీపాలు - సంత రోజున ప్రజల అవస్థలు
-అంబాజీపేట మేజర్ న్యూస్ :మండల కేంద్రమైన అంబాజీపేటలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన కూడలి అయిన హైస్కూల్ ఎదుట వీధి దీపాలు మిణుకు మిణుకుమనడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కీలక ప్రాంతంలో ఆగుతూ వెలగుతున్న దీపాలు : అంబాజీపేట హైస్కూల్ ఎదురుగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండటంతో ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. అటువంటి కీలక ప్రాంతంలోనే వీధి దీపాలు ఆగుతూ వెలగడంతో విద్యార్థులు, రోగులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వేళ మిలుకు మిలుకు కాంతులతో ఆ ప్రాంతమంతా అంధకారంలోకి వెళ్లింది.
వారపు సంత రోజు వ్యాపారులకు తిప్పలు :బుధవారం వారపు సంత కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు, వ్యాపారులు అంబాజీపేటకు తరలివచ్చారు. రద్దీ సమయంలోనే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో కొనుగోలుదారులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు చీకట్లోనే అవస్థలు పడ్డారు. సరుకులు విక్రయించలేక వ్యాపారులు ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారపు సంత వంటి రద్దీ రోజుల్లోనైనా నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చూడాలని, సాంకేతిక లోపాలను తక్షణమే సరిచేయాలని స్థానికులు, వ్యాపార వర్గాలు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.