ఐదేళ్లుగా పెంచుకున్న బిడ్డకు దూరమయ్యామంటూ తల్లిదండ్రుల ఆవేదన!
బాపట్ల, మేజర్ న్యూస్; ఐదేళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి తమకు దూరం కావడంతో ఆ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురవుతోంది. బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారిపాలెం గ్రామానికి చెందిన ఓ కుటుంబం రెండు రోజుల వయసున్న బాలుడిని ఆసుపత్రి నుంచి తీసుకువచ్చి అప్పటి నుంచి పెంచుకుంటోంది. అయితే ఈ విషయం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు స్పందించి బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకుని బాలసదనంలో ఉంచారు.దీంతో బాలుడిని పెంచుకుంటున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజులుగా బాలసదనం చుట్టూ తిరుగుతూ బాలుడిని తమకు అప్పగించాలని వేడుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఐదేళ్లుగా తమ కుటుంబంలో ఒకరిగా పెంచుకున్నామని, ఇకపై కూడా సొంత బిడ్డలా చూసుకుంటామని ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బాలుడి సంరక్షణపై తమకు పూర్తి బాధ్యత ఉందని, అధికారులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంలో అధికారుల నుంచి స్పష్టమైన స్పందన రావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించాలి..
బాలుడి భవిష్యత్తు, సంక్షేమం దృష్టిలో పెట్టుకుని అధికారులు మానవీయ కోణంలో ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. బాలుడిని పెంచుకుంటున్న కుటుంబ పరిస్థితులు, ఐదేళ్లుగా అందించిన సంరక్షణ, బాలుడితో ఉన్న అనుబంధాన్ని సమగ్రంగా పరిశీలించి చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బాలుడి అభిప్రాయం, భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కోరుతున్నారు.