అర్హులైన వారికి కొత్త పింఛన్లు : సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి
షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 21) షాబాద్ మండల పరిధిలోని అంతారం గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల సర్టిఫికెట్లను శనివారం గ్రామ సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 15 మంది నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఈగ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన పేదలకు చేయూత పింఛన్లు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కలుగుతుందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, నూతన పింఛన్ లబ్ధిదారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.