మున్సిపల్ ఎన్నికల్లో 94% స్ట్రయిక్ రేట్ సాధించాం..
అమరావతి: ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా, పోస్టల్ బ్యాలెట్ అయినా విజయం ఎన్డీయే కూటమిదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, అభ్యర్థుల ఎంపికపై ఆయన స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి 94 శాతం స్ట్రయిక్ రేట్ సాధించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కూటమి బలం మరింత పెరిగిందని, ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఓటు శాతం 6.25 మేర తగ్గిందని ఆయన విశ్లేషించారు.
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గురించి వివరిస్తూ.. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని సీఎం చెప్పారు. ముఖ్యంగా మంచి విద్యార్హతలు ఉన్నవారికే ఈ ఎన్నికల్లో టికెట్లు కేటాయించామని స్పష్టం చేశారు. జిల్లా నేతలు, స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జీలు, పార్టీ సీనియర్ నాయకులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే అభ్యర్థుల తుది జాబితాను రూపొందించామని చంద్రబాబు వివరించారు.