టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ.. కల్లమల్లలో లాఠీఛార్జ్
కడప: వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా తెలుగుదేశం (టీడీపీ), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే.. నామినేషన్ల దాఖలు సమయంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఎదురుపడటంతో మొదలైన వాగ్వాదం కాస్తా పరస్పర దాడులు, ఘర్షణలకు దారితీసింది. ముఖ్యంగా నియోజకవర్గంలోని చింతకుంట, చిలంకూరు, కల్లమల్ల గ్రామాల్లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
కల్లమల్లలో ఇరువర్గాల కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి ఘర్షణకు దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.