గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
సూర్య, నంద్యాల బ్యూరో:జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలతో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నేడు (21వ తేదీ) నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనున్న నేపథ్యంలో తుది పోటీదారుల జాబితాను అదే రోజు ఖరారు చేయాలని ఆదేశించారు. ఏకగ్రీవమైన స్థానాల వివరాల ఆధారంగా రవాణా ఏర్పాట్లు, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను మరోసారి సమీక్షించుకోవాలని, అవసరమైన సీసీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, సిబ్బందిని ముందుగానే కేటాయించాలని సూచించారు. మొదటి విడత ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఈ నెల 23వ తేదీన ఆయా మండల కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పోలిస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత కీలకమైనవని, పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఒకే గదిలో ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లు ఉండే అవకాశం ఉన్నందున, పోలింగ్ కేంద్రాల వారీగా కాకుండా గదుల వారీగా సీసీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, సిబ్బంది వివరాలను సిద్ధం చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. రెండో విడత ఎన్నికల పరిధిలోని బనగానపల్లె, పాణ్యం, ఆత్మకూరు ప్రాంతాల్లో నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై వచ్చే అప్పీళ్లను సంబంధిత ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లకు పంపించి ఎన్నికల నిబంధనల ప్రకారం పరిష్కరించాలని సూచించారు. రెండో విడత ఎన్నికల సిబ్బందికి నవంబర్ 25వ తేదీన శిక్షణతో పాటు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు..మూడో విడత ఎన్నికల పరిధిలోని నందికొట్కూరు, డోన్ ప్రాంతాల్లో నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూడో విడత ఎన్నికల సిబ్బందికి నవంబర్ 28వ తేదీన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అవగాహన కల్పించి, ఆ సదుపాయాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ బాక్సులు, స్టేషనరీ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, ఎన్నికల యంత్రాంగం పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని తెలిపారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*