హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో వికారాబాద్ జిల్లాకు జాతీయ గుర్తింపు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి,మేజర్ న్యూస్: హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో వికారాబాద్ జిల్లా జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష’ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయంగా నిర్దేశించిన 95-95-95 లక్ష్యాలను విజయవంతంగా సాధించి జిల్లా ‘సురక్షిత్ (Surakshit) స్థితి’ని పొందింది. ఈ ఘనతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 1న న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో నిర్వహించనున్న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం-2026 వేడుకల్లో వికారాబాద్ జిల్లాను సత్కరించనుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రితు శర్మ, జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి అధికారిక ఆహ్వానం పంపించారు. కలెక్టర్‌తో పాటు సివిల్ సర్జన్, సీఎంహెచ్‌ఓ, డీఎంహెచ్‌ఓ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి బృందాన్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం, వ్యాధి నియంత్రణ, ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎయిడ్స్ నియంత్రణ విభాగం, వైద్యులు, సిబ్బంది, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలు చేసిన సమిష్టి కృషికి ఈ జాతీయ స్థాయి గుర్తింపు నిదర్శనంగా నిలిచింది. గతంలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ విజయాన్ని అంకితం చేస్తూ, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో వ్యాధి నియంత్రణకు కృషి చేయాలని అధికారులు ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మార్గదర్శకత్వంలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణలో సాధించిన ఈ విజయం వికారాబాద్ జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.