అద్దంకి సీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆరోగ్య శాఖ కమిషనర్
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు గురువారం తనిఖీ చేశారు. అద్దంకి ఆర్డీవో కార్యాలయంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పరిశీలనకు వచ్చిన ఆయన ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రిగా ఉన్న అద్దంకి సీహెచ్‌సీని ఏరియా ఆసుపత్రిగా మార్చేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రతిపాదన వచ్చిందని పేర్కొన్నారు. వైద్యులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ, ప్రజల సూచన మేరకు నూతన ప్రతిపాదనను ఆమోదిస్తామన్నారు. ప్రస్తుత భవనం సరిపోదని, కొత్త భవనం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. ఆయనతోపాటు జిల్లా వైద్యాధికారి డాక్టర్ టీ వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మీకుమారి, డాక్టర్ వాహిలా చౌదరి, డాక్టర్ వెంకటకిరణ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.