ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రతపై కౌన్సెలింగ్ : ట్రాఫిక్ డీఎస్పీ కాంతారావు
గుంటూరు : గుoటూరు బస్టాండ్ సెంటర్‌లోని ఆటో స్టాండ్ వద్ద ట్రాఫిక్ డీఎస్పీ కాంతారావు ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రతపై పలు సూచనలు చేశారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రయాణికులు తమ లగేజీ, విలువైన వస్తువులు పోగొట్టుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా సహకరించాలని తెలిపారు.
ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా అభయ్ ఆటో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, ప్రయాణికులు కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి ఆటో ముందు, వెనుక భాగాల్లో ఆటో రిజిస్ట్రేషన్ నంబర్, యజమాని ఫోన్ నంబర్, డ్రైవర్ ఫోన్ నంబర్‌తో పాటు పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఆటో నంబర్ ప్లేట్లు స్పష్టంగా కనిపించేలా ఉండాలని, పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే ఆటోలను పార్కింగ్ చేయాలని తెలిపారు. ఇష్టానుసారంగా ఆటోలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించరాదని హెచ్చరించారు.
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ డీఎస్పీ సూచించారు.
కే నాగరాజు గుంటూరు క్రైమ్