తల్లిది అధికారం....! కుమారుడిది పెత్తనం....!!
కనగల్ మేజర్ న్యూస్:మండలం లోని దోరెపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. గ్రామ ప్రథమ పౌరురాలైన సర్పంచ్ బక్క ఎల్లమ్మ లేకుండానే ఆమె కుమారుడు మరియు ఇతర నాయకులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు పత్రాలను అందజేయడంపై తీవ్ర విమర్శలకు దారితీసింది.
అసలేం జరిగిందంటే..
గ్రామంలో కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే నిబంధనల ప్రకారం గ్రామ సర్పంచ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ సర్పంచ్ బక్క ఎల్లమ్మ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. ఆమె స్థానంలో ఆమె కుమారుడు, మరికొందరు నాయకులు ముందుండి అధికారుల సమక్షంలో పింఛన్ పత్రాలను పంపిణీ చేశారు.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై గ్రామంలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ప్రజలు ఎన్నుకున్న మహిళా సర్పంచ్ ని పక్కన పెట్టి ఆమె కుమారుడు పెత్తనం చెలాయించడంపై గ్రామస్థులు ప్రతిపక్ష నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిన పంచాయతీ కార్యదర్శి ఇతర అధికారులు సైతం సర్పంచ్ లేకపోయినా కార్యక్రమాన్ని నిర్వహించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు మహిళా సర్పంచుల స్థానాల్లో వారి కుటుంబ సభ్యుల జోక్యం తగదని ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడుతున్నారు
ఈ అంశం ఫై ఉన్నతాధికారులు స్పందించి భవిష్యత్తులో ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.