మహిళల భద్రత, ర్యాగింగ్ నిరోధం, మాదక దవ్యాల వలన జరిగే పరిణామాలపై అవగాహన
ఏలూరు, మేజర్ న్యూస్ : ఆశ్రమ మెడికల్ కాలేజీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ , ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమంలో భాగంగా మహిళా భద్రత, మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలు, రహదారి భద్రత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జివిజి అశోక్ కుమార్ , ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ హాజరై విద్యార్థులకు విలువైన సందేశాన్ని అందించారు.
ఈ కార్యక్రమములో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ నేను ఈ రోజు మీతో ఒక చిన్న విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను.* అది కేవలం ర్యాగింగ్ గురించి కాదు. మానవత్వం గురించి.
సీనియర్స్ అంటే ఎవరు, జూనియర్లను భయపెట్టేవారు నిజమైన సీనియర్లు కాదు. వారికి అండగా నిలబడి, వారిలో ధైర్యాన్ని నింపి, సరైన మార్గంలో నడిపించేవారే నిజమైన సీనియర్లు.
చాలామంది ర్యాగింగ్ చేస్తే గౌరవం వస్తుందని భావిస్తారు. కానీ భయం వల్ల వచ్చేది గౌరవం కాదు. అది కేవలం భయం మాత్రమే. ఒక వ్యక్తి మంచి మనసును, ప్రతిభను, వ్యక్తిత్వాన్ని చూసి ఇతరులు మనస్ఫూర్తిగా ఇచ్చేదే నిజమైన గౌరవం. మీరు చదువులో రాణించినా, క్రీడల్లో ప్రతిభ చూపించినా, మంచి మాటతీరుతో, మంచి ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా నిలిచినా జూనియర్లు మిమ్మల్ని చూసి ‘మా సీనియర్ కూడా ఇలాగే ఉండాలి’ అని అనుకుంటారు. అదే నిజమైన నాయకత్వం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ర్యాగింగ్‌తో కాదు, భయపెట్టడం ద్వారా కాదు. మీ మంచి మనసుతో, మీ ప్రతిభతో, మీ వ్యక్తిత్వంతో అందరి మనసులను గెలుచుకోండి. అదే నిజమైన నాయకత్వం.
మీరందరూ భవిష్యత్తులో వైద్యులుగా ఎదగబోతున్నారు. ఒక వైద్యుడు ప్రాణాలను కాపాడేవాడు. ప్రతి మనిషి ప్రాణానికి విలువనిచ్చే వైద్య వృత్తిలోకి వెళ్ల బోతున్న మీరు, మరొకరి మనసును బాధపెట్టడం ఎంతవరకు సమంజసం. ఇతరుల బాధను అర్థం చేసుకుని, వారికి అండగా నిలబడటమే నిజమైన మానవత్వం.
కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎవరినీ భయపెట్టకూడదు, ఎవరినీ కించపరచకూడదు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా మనమందరం ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలి.
తప్పు చేసిన వ్యక్తి తన తప్పును తెలుసుకుని మారడం ముఖ్యం. అయితే ర్యాగింగ్ వంటి తప్పులు మళ్లీ జరగకుండా బాధ్యతగా వ్యవహరించేవారే నిజమైన ఆదర్శప్రాయులు.
చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరు ఈ కళాశాలను విడిచి వెళ్లిన తర్వాత మీ పేరు గుర్తుండేది మీరు ఎంతమందిని ఏడిపించారనే దానివల్ల కాదు; ఎంతమందికి అండగా నిలబడ్డారు, ఎంతమంది జీవితాల్లో మంచి మార్పుకు కారణమయ్యారు అనే దానివల్ల.
ర్యాగింగ్‌కు నో చెప్పండి. గౌరవానికి అవును చెప్పండి అని తెలిపారు.
ఏలూరు రేంజ్ ఐజి జి వి జి అశోక్ కుమార్ ఐపీఎస్ వారు మాట్లాడుతూ మీరు ఇప్పటికే ఎంబీబీఎస్ అంటే చాలా ఒత్తిడి ఉంటుంది. ప్రతి సంవత్సరం మీరు అనేక సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది, ఈ సెమిస్టర్ల వల్ల ఆందోళన (టెన్షన్) ఉంటుంది. కాబట్టి దాని మీద మీరు దృష్టి పెట్టాలి.ఈ కొత్త విద్యార్థులతో జూనియర్లతో మీరు స్నేహపూర్వకంగా ఉండాలి. మీరు మొదట కాలేజీకి వచ్చినప్పుడు ఎలా వచ్చారు, ఎలా అనిపించింది, ఎంత ఆందోళన చెందారు.
ప్రతి ఒక్కరూ పరస్పర గౌరవం, క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తనను అలవర్చుకోవాలని ఏలూరు రేంజ్ ఐజి తెలిపారు.
కళాశాలల్లో ర్యాగింగ్ తీవ్రమైన నేరమని, విద్యార్థుల భవిష్యత్తు, ఆత్మ గౌరవం, మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.
ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే భయపడకుండా కళాశాల యాజమాన్యానికి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక అనర్థాలను వివరించారు.
విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసే వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన చట్టాలు, వారికి కల్పించిన రక్షణ, మహిళల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన బాధ్యతపై అధికారులు అవగాహన కల్పించారు. మహిళలు లేదా బాలికలకు ఏదైనా ఆపద ఎదురైనప్పుడు వెంటనే పోలీసుల సహాయం పొందాలని సూచించారు.విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వినియోగం, అతివేగం వల్ల కలిగే ప్రమాదాలు, రహదారిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు.ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు పిలుపునిస్తూ, ర్యాగింగ్‌కు దూరంగా ఉండండి మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దు మహిళలను గౌరవించండి ట్రాఫిక్ నిబంధనలు పాటించండి అని సూచించారు. కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ , రిటైర్డ్ ఎస్పీ నక్కా సూర్యచంద్ర రావు , ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు , ఏలూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ , ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ నాగబాబు , ఈగల్ ఆర్ఎస్ఐ బి. ఉదయభాస్కర్ , శక్తి టీమ్ సభ్యులు, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.