ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఆశ్వయుజ పౌర్ణమిని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఘాట్ రోడ్డులోని శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి వద్ద ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చారణలు, భజన సంకీర్తనలు, సంప్రదాయ కోలాట ప్రదర్శనల నడుమ గిరి ప్రదక్షిణ కొనసాగింది. మార్గమధ్యంలో మహిళలు రహదారులను పసుపు నీటితో శుద్ధి చేసి, హారతులు సమర్పిస్తూ జయజయధ్వానాలు చేశారు. భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి కుంకుమ, ప్రసాదాలను పంపిణీ చేశారు.
ఘాట్ రోడ్డు, కుమ్మరిపాలెం, విద్యాధరపురం, పాలప్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకునేలా ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, సూపరింటెండెంట్ హేమ దుర్గాంబ, సీనియర్ అసిస్టెంట్ శిరీష తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.