గోదావరి జలాలతో సింగూరు–మంజీరా ప్రాంతాలకు తాగునీటి భరోసా! సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జలమండలి ముందస్తు చర్యలు
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):రానున్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జలమండలి ముందస్తు చర్యలను ముమ్మరం చేసింది. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లను చేపట్టింది.
సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఆయా జలాలపై ఆధారపడిన ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సమీపంలోని వెలిమెల గ్రామం వద్ద 3000 మి.మీ. వ్యాసం గల గోదావరి రింగ్ మెయిన్‌ను, 1200 మి.మీ. వ్యాసం గల మంజీరా ఫేజ్-III, IV గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్లతో అనుసంధానించే పనులు చేపట్టింది.
ఈ పనుల పురోగతిని జలమండలి టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, సీజీఎం రాజశేఖర్ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి, గోదావరి జలాలను సింగూరు–మంజీరా సరఫరా వ్యవస్థలోకి మళ్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ అనుసంధాన పనులు పూర్తయితే సింగూరు–మంజీరా సరఫరా ప్రాంతాలకు గోదావరి జలాలను అందించేందుకు వీలవుతుందని, తద్వారా నీటి ఎద్దడి పరిస్థితుల్లోనూ తాగునీటి సరఫరాలో అంతరాయాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.