జవహర్ నగర్ డంప్ యార్డ్ తరలింపు కోసం రాజీలేని పోరాటం: మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా నరకయాతన అనుభవిస్తున్న లక్షలాది మంది ప్రజల సమస్యను పరిష్కరించే వరకు రాజీపడే ప్రసక్తే లేదని, ఈ నెల 27 నుంచే బాధిత ప్రజలతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నామని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ,.. తెలంగాణ మొత్తం ఆదాయంలో 70 శాతం రాబడి ఇచ్చే హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలను కాలుష్యంతో బతికేలా చేయడం దారుణమన్నారు. జవహర్ నగర్‌లో ఉన్న కోట్ల టన్నుల చెత్త వల్ల భూగర్భ జలాలు విషపూరితమయ్యాయని, అక్కడ వెలువడే మిథేన్ వాయువు దాదాపు 12 లక్షల కార్ల పొల్యూషన్‌తో సమానమని ఆందోళన వ్యక్తం చేశారు. రాంకీ సంస్థ ఈ చెత్త విషయంలో గుత్తాధిపత్యం చలాయిస్తూ, ఆటోలలో చెత్త సేకరించే పేద కార్మికులపై బౌన్సర్లతో దాడులు చేయించడం నీచమైన చర్య అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కక్షలు పక్కనపెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, చెత్తను ఒకే చోట కేంద్రీకరించకుండా నగరం బయట 30-40 కిలోమీటర్ల దూరంలో శాస్త్రీయ పద్ధతిలో క్లస్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి కేంద్రంతో మాట్లాడి రూ.2000 నుంచి రూ.3000 కోట్ల నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రముఖుల ప్రసంగాలు:*
పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి (వీడియో కాన్ఫరెన్స్): హైదరాబాద్‌లోని మొత్తం చెత్తను ఒకే చోట కేంద్రీకరించకుండా నగరాన్ని నాలుగు దిక్కులుగా విభజించి వేర్వేరు ప్రాంతాల్లో ఆధునిక శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అప్పుడే జవహర్‌నగర్‌పై భారం తగ్గుతుందని సూచించారు.
బండ కార్తీక రెడ్డి (మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు): 150 డివిజన్ల చెత్తను ఒకే ప్రాంతంపై రుద్దడం వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందని, విష కాలుష్యం నుంచి జవహర్ నగర్ ప్రజలను కాపాడేందుకు డంపింగ్ యార్డును తక్షణమే తరలించాలని డిమాండ్ చేశారు.
చిరంజీవులు (మాజీ ఐఏఎస్ అధికారి): కోటి మంది చెత్తను జవహర్ నగర్ ప్రజలు భరించాల్సి రావడం అన్యాయమని, జర్మనీ, సౌత్ కొరియా టెక్నాలజీలతో రీజనల్ రింగ్ రోడ్డుకు అవతల వేస్ట్ టు వెల్త్ ప్రాసెస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
దొంతి నరసింహ రెడ్డి (పర్యావరణవేత్త): మున్సిపల్ చెత్త నిర్వహణ సరిగా లేకపోవడం ప్రమాదకరమని, చెత్తను మూలంలోనే వేరుచేసి శాస్త్రీయంగా నిర్వహించాలన్నారు.
జాజుల శ్రీనివాస్ గౌడ్ (బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు): ప్రజల కోసం నిలబడే నాయకుడు ఈటల రాజేందర్ అని, ఆయన చేపడుతున్న పాదయాత్రకు బిసి, ఎస్సీ, ఎస్టీ సంఘాల తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.
ప్రొఫెసర్ కృష్ణారెడ్డి (హెచ్‌సీయూ): జవహర్ నగర్ డంప్ యార్డును తరలించడంతో పాటు పౌరుల్లో చెత్త వర్గీకరణపై సరైన చైతన్యం కల్పించాలని చెప్పారు.
తిప్పారపు లక్ష్మణ్ (ఎంఆర్‌పీఎస్ ప్రతినిధి): మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్‌పీఎస్ తరఫున ఈ పాదయాత్రకు పూర్తి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పర్యావరణవేత్తలు మల్లికార్జున రెడ్డి, దామోదర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఎన్‌ఎఫ్‌సీ మాజీ డిజిఎం హనుమంత రెడ్డి, ఎస్బీహెచ్ మాజీ బోర్డ్ డైరెక్టర్ పంపాలా నరసింహ, యాంటీ డంప్‌యార్డ్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ శంకర నారాయణ, కో-కన్వీనర్లు మారం సమ్మిరెడ్డి, ఏనుగు సంజీవరెడ్డి, బట్టి శంకర్, ఓరుగంటి కృష్ణ కిషోర్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లాల తిరుమల రెడ్డి,పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, అడ్వకేట్ కౌశిక్, మింగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.