ఆపదలో ఉన్న కుటుంబానికి కాపు ఐక్య వేదిక ఆపన్నహస్తం
కడియం ,మేజర్ న్యూస్ :కడియం మండలం మురమండ గ్రామానికి చెందిన ప్రమాద బాధిత యువకుడు తుమ్మలపల్లి బాలు సాయి కుటుంబానికి కడియం మండల కాపు ఐక్య వేదిక అండగా నిలిచింది. ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న బాలు సాయి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న ఐక్య వేదిక సభ్యులు రూ.70 వేల ఆర్థిక సాయం అందజేశారు.
గత నెలలో గ్రానైట్ రాళ్లను దించుతున్న సమయంలో రాళ్లు పడటంతో బాలు సాయి తీవ్రంగా గాయపడి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. శస్త్రచికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయన కుటుంబ పరిస్థితిని మురమండకు చెందిన ఐక్య వేదిక సభ్యుడు యర్రంశెట్టి వీరబాబు ద్వారా ఫౌండర్ ఆదిమూలం సాయిబాబా తెలుసుకున్నారు. దీంతో కడియం మండల కాపు ఐక్య వేదిక వాట్సాప్ బృందం ద్వారా సభ్యుల నుంచి సేకరించిన రూ.70 వేల నగదును మంగళవారం బాధిత కుటుంబానికి అందజేసి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆదిమూలం సాయిబాబా మాట్లాడుతూ, ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చిన ప్రతి సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాపు ఐక్య వేదిక ప్రతినిధులకు, సభ్యులకు కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిమూలం సాయిబాబా, యర్రంశెట్టి వీరబాబు, పొట్టిలంక మామాజీ, మోతుకూరి రాము, సలాది నాగేశ్వరరావు, అడబాల రామకృష్ణ, కేబుల్ నాగు, వెంకటేశ్వరరావు, సుంకర శ్రీనివాస్, దుర్గారావు, పిల్లా వెంకట్రావు, బొప్పన సత్తిబాబు, బీరా రాజు, పెంటయ్య, ఉలుసు శీను, చాపా విజయ్ తదితరులు పాల్గొన్నారు.