ఆపదలో పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి
పులివెందుల మేజర్ న్యూస్:
పేద ప్రజలకు వైద్య అత్యవసర పరిస్థితుల్లో అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి తెలిపారు. పులివెందుల పట్టణంలోని ఆయన నివాసంలో 70 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.45.38 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రామగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు. ప్రజల కష్టాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకాన్ని సీఎంఆర్‌ఎఫ్ మరింత బలపరుస్తోందన్నారు.
చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తమ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించినందుకు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పి కృష్ణ పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా