30వ డివిజన్‌లో నూనె రుషి యాదవ్ విస్తృత ప్రచారం
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 30వ డివిజన్‌లో జనసేన పార్టీ అభ్యర్థి నూనె రుషి యాదవ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జనసేన నాయకుడు నూనె మల్లికార్జున యాదవ్ తనయుడైన రుషి యాదవ్ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ఓటర్లను కలుస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్న ఆయన, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతు తెలిపి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానికులతో ఉన్న పాత పరిచయాలు, ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నాల ద్వారా ఓటర్లకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్నారు. ఇదే డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి ఖాదర్ బాషా కూడా పోటీలో ఉండటంతో ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది. డివిజన్‌లో యాదవ సామాజికవర్గం ఓటర్లు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లో ముఖ్యులను కలుస్తూ మద్దతు కూడగట్టేందుకు రుషి యాదవ్ ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా 30వ డివిజన్‌లో జనసేన అభ్యర్థి ప్రచారాన్ని ముమ్మరం చేయగా, ఇతర అభ్యర్థుల ప్రచారంతో ఎన్నికల పోటీ ఎలా సాగుతుందన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఎన్నికల ఫలితాల్లో తేలనుంది.