28వ తేదీ నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
సీతానగరం నవంబర్ 23 మేజర్ న్యూస్....జిల్లాలో ఈ నెల 28వ తేదీ నుంచి అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు జిల్లా పౌర సరఫరాల డీఎం బాలాజీ రామ్ .జిల్లా వ్యవసాయ అధికారి భవాని శంకర్
తెలిపారు. ఈ మేరకు పణుకుపేటలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారులు మాట్లాడుతూ ధాన్యం విక్రయించే సమయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు, ఆందోళనలకు గురికాకుండా ముందస్తుగానే ధాన్యాన్ని కొనుగోలుకు సిద్ధం చేసుకోవాలని సూచించారు.రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని సిద్ధం చేసుకోవాలని, ముఖ్యంగా తేమ శాతం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. కోతలు పూర్తి చేసిన రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.ధాన్యం కొనుగోలుకు అవసరమైన గోనె సంచులను రైతులకు రైతు సేవా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు మిల్లర్లు సైతం బ్యాంకు గ్యారెంటీలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నారని .ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.రైతులు తమకు అనుకూలమైన మండల పరిధిలోని నచ్చిన రైస్ మిల్లుకు ధాన్యాన్ని పంపించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని సిద్ధం చేసుకుని కొనుగోలు ప్రక్రియకు సహకరించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్ అవినాష్ తో పాటు వ్యవసాయ శాఖ సిబ్బంది. రైతులు పాల్గొన్నారు.