BREAKING
ఏపీలో 'తల్లికి వందనం సోమనాథ్‌ స్వాభిమాన్‌ యాత్రకు శ్రీకారం రాయలసీమ అభివృద్ధికి గ్లోబల్ హార్టికల్చర్ హబ్ బలమైన పునాది పిఆర్టియు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా కట్ట శేఖర్ రావు, ఆర్ రంగారావు ఎన్నిక తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వైయస్సార్ సిపి పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి: కె. సుజాత భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ lo మూడో యూనిట్ నిలిచిపోవడం ప్రభుత్వ వైఫల్యమే.. మాజీ మంత్రి పువ్వాడ మాదిగ ఉద్యోగుల సమాఖ్య నూతన కమిటీకి ఘన సత్కారం ఏపీలో గృహ నిర్మాణానికి కొత్త శకం.. వైద్య ఆరోగ్యశాఖ ఔట్సోర్సింగ్ సిబ్బంది పెన్ డౌన్. మైసూరు దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్‌ 2.0 విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి ఎర్రుపాలెం మండలంలో 12.89 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

2029 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్లు

Select Suryaa Now
2029 నాటికి రాష్ట్రంలో  పేదలందరికీ ఇళ్లు

పేదలకు పట్టాభిషేకం.. 9 లక్షల ఇళ్లకు కేంద్రం భరోసా!

-బుర్రిపాలెం వేదికగా పేదల సొంతింటి కలకు బాబు భరోసా

-రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

-ప్రత్యేక విజ్ఞప్తితో కేంద్రం నుంచి 3 లక్షల ఇళ్ల మంజూరు

-మూడు దశల్లో ఏపీకి మొత్తం 9 లక్షల ఇళ్లు.. కేంద్రం హామీ

-2029 నాటికి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు లక్ష్యం

-రూ.14 కోట్లతో బుర్రిపాలెంలో 3డీ ప్రింటింగ్ హౌసింగ్ పైలట్ ప్రాజెక్ట్

-కేవలం 10 రోజుల్లోనే 3డీ టెక్నాలజీతో ఇంటి నిర్మాణం

-ఇప్పటికే కూటమి ప్రభుత్వం 5.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించింది

-పేదలకు రూ.52 వేల కోట్ల విలువైన ఇంటి స్థలాలు ఇచ్చాం

-పేదల జీవితాల్లో మార్పునకు 3 లక్షల ఇళ్ల నిర్మాణం శ్రీకారం

-3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్టుగా 177 ఇళ్ల నిర్మాణం

-కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

-పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న ముఖ్యమంత్రి సంకల్పం గొప్పదని చౌహాన్ వ్యాఖ్య

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

వచ్చే 2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ వంద శాతం పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పేదలకు సొంతిల్లు ఉంటే వారి జీవన ప్రమాణాలతో పాటు ఆత్మగౌరవం పెరుగుతుందని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ఆదివారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారు కుటుంబంతో కలిసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రానికి సాధారణ కోటా కింద 75 వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని, ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం 3 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని చంద్రబాబు తెలిపారు. ఈ 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగానే మరో 3 లక్షల ఇళ్లను, వచ్చే ఏడాది మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అంగీకరించారని చెప్పారు. మొత్తంగా 9 లక్షల ఇళ్లను రాష్ట్రానికి మంజూరు చేసేందుకు కేంద్రం సహకరిస్తోందని తెలిపారు. పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలన్న ఆలోచనకు ఎన్టీఆర్‌ శ్రీకారం చుట్టారని సీఎం గుర్తు చేశారు. 3 లక్షల ఇళ్ల నిర్మాణం అంటే కేవలం ఇళ్ల నిర్మించడమే కాదని, 3 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పునకు శ్రీకారం చుట్టే కార్యక్రమమని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు వేసిన ఓటుతో సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ చేర్చేలా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. గృహ నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు బుర్రిపాలెంలో రూ.14 కోట్లతో 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ ద్వారా 177 ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం సందర్శించారు.  కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి అధికారులు వివరించారు. 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతతో తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో పటిష్టమైన ఇళ్లను నిర్మించవచ్చని అధికారులు వివరించారు. ఈ సాంకేతికతతో నిర్మించే ఇళ్లలో బయట వాతావరణంతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించినట్టు సీఎం అన్నారు.

పేదలకు రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలు

పేదలకు పట్టాభిషేకంలో భాగంగా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి పేదలకు నివాస స్థలాలు అందించామని చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి సహా వివిధ ప్రాంతాల్లో రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను పేదలకు అందించామని చెప్పారు. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ అజెండా అని స్పష్టం చేశారు. గత పాలనలో గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని సీఎం విమర్శించారు. 2019–24 మధ్య 6 లక్షల పేదల ఇళ్లను రద్దు చేశారని, నివాసయోగ్యం కాని చెరువులు, గుట్టల్లో ఇంటి స్థలాలు ఇచ్చారని ఆరోపించారు. దాదాపు 4 లక్షల మంది ఆ స్థలాలను వద్దంటూ వెనక్కి ఇచ్చేశారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ పేదలకు పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి పోలవరం పూర్తయ్యేలోగా గోదావరి నీటిని వినియోగించుకున్నామని సీఎం చెప్పారు. ఎల్‌నినో వంటి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోనూ కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలించి పంటలను కాపాడగలిగామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటి సమస్య లేకుండా చేస్తామని అన్నారు. రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అంకురార్పణ చేశామని, రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఉద్యాన ఫలాల ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ.1.30 లక్షల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు.

త్రీడి ప్రింటింగ్ టెక్నాలజీ పరిశీలన

అంతకుముందు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టును సందర్శించారు. సీబీఆర్ఐ అధికారులు వారికి త్రీడీ టెక్నాలజీ నిర్మాణ ప్రక్రియ గురించి వివరించారు. కేవలం 10 రోజుల్లో ఒక ఇంటిని ఈ సాంకేతికతో నిర్మించే అవకాశముందని తెలిపారు. అనంతరం ఇరువురు నేతలూ ఓ లబ్దిదారు కుటుంబానికి చెందిన ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసిన అనంతరం లబ్దిదారు కుటుంబంతో ఆప్యాయంగా మాట్లాడి వారికి నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సూచికగా శిలాఫలకం ఆవిష్కరించి అక్కడికి సమీపంలోనే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం వేదికపై లక్ష్మీ అనే మహిళకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇంటి పట్టాన అందించారు.