తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
స్కూళ్ల ఆధునికీకరణ, బ్రిడ్జిల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి*
*మెప్మా ద్వారా మధిర పట్టణంలో 10 వేల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ*
*జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం
ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను హెచ్చరించారు. ఆదివారం ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని వాసిరెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి వివిధ శాఖల అభివృద్ధి, సంక్షేమ పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడూతూ, అధికారులు బాధ్యతగా, జవాబుదారీతనంతో ప్రజలకు సేవ చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సరఫరా విషయంలో అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని, ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. త్రాగునీటి సమస్య వస్తే వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మధిర నియోజకవర్గంలో 9 స్కూళ్లను ఆధునికీకరించి అన్ని సదుపాయాలతో మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దాలని 57 కోట్ల 69 లక్షల రూపాయలను మంజూరు చేశామని, ఆధునికీకరణ, సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేసి, విద్యార్థులకు త్వరితగతిన అందుబాటులోకి తేవాలన్నారు.
రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణ పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేసి రవాణా సౌకర్యాన్ని సులభతరం చేయాలన్నారు. బ్రిడ్జిల నిర్మాణం ఆలస్యమైతే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.
మెప్మా ఆధ్వర్యంలో మధిర పట్టణంలోని 10,000 మంది మహిళలకు వివిధ రంగాల్లో ఉపాధి, స్వయం ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రస్తుతం డిమాండ్ ఉన్న పనుల్లో నైపుణ్య శిక్షణ ఇస్తే, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు.
రహదారుల విస్తరణ, వివిధ అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాల తరలింపు పనులు వేగంగా సాగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. స్తంభాల తొలగింపు పనులతో అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు.
భూ రీ-సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ప్రజా ఫిర్యాదులకు తావులేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం అన్నారు. రిసర్వే ప్రక్రియ తర్వాత రికార్డుల నమోదు జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు.
నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు గడువులోగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు టీ. మధుసూదన్, వీ. మోహన్ రావు, సి ఈ గౌతం రెడ్డి, ఎస్ ఈ శ్రీనివాసా చారి, పీఆర్ ఎస్ ఈ వెంకట్ రెడ్డి, తహశీల్దార్ సునీత ఎలిజబెత్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.