సోమనాథ్ స్వాభిమాన్ యాత్రకు శ్రీకారం
విజయవాడ నుంచి 1100 మంది భక్తుల పయనం
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్ ఆలయ దర్శనానికి విజయవాడ నుంచి 1100 మంది భక్తులు ప్రత్యేక రైలులో బయలుదేరారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సోమనాథ్ స్వాభిమాన్ యాత్ర’ ప్రత్యేక రైలును విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో కలిసి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు ప్రారంభించారు.
సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనానికి ప్రత్యేక యాత్ర
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ప్రత్యేక యాత్రలో పాల్గొంటున్నారు. విజయవాడ నుంచి మొత్తం 1100 మంది భక్తులు ప్రత్యేక రైలులో సోమనాథ్ క్షేత్రానికి బయలుదేరారు. భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, దర్శనం కల్పించేలా యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు.
ఆలయ పునర్నిర్మాణానికి 75 ఏళ్లు.. స్వాభిమాన్ యాత్ర
సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక యాత్రను నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాత్ర ద్వారా భక్తులకు సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆధ్యాత్మికతతో పాటు దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో యాత్రను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరే సమయంలో భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. స్వామివారి దర్శనం కోసం బయలుదేరిన భక్తులకు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు ఇటువంటి ప్రత్యేక యాత్రలు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.