మైసూరు దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ 2.0
- అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు
-విజయవాడ ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బోండా ఉమ
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ నగరంలో‘విజయవాడ ఉత్సవ్ 2.0’ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మైసూరు దసరా తరహాలో పది రోజులపాటు నగరవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు, వివిధ స్టాల్స్‌తో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు.
ఎంబీకే స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన
సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో విజయవాడ ఉత్సవ్ 2.0కు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే బోండా ఉమ పరిశీలించారు. కళావేదికలు, స్టాల్స్, అతిథులు వచ్చే మార్గాలు, భద్రత, ఇతర సౌకర్యాలపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఉత్సవ్ 2.0 పోస్టర్లను ఆవిష్కరించి, విలేకరుల సమావేశంలో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
ఈ నెల11 నుంచి పది రోజులపాటు వేడుకలు
దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ 11 నుంచి వరుసగా పది రోజులపాటు విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నామని బోండా ఉమ తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కూడా ఉత్సవ్ వేడుకలకు వేదిక కానుందని చెప్పారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంతో పాటు పున్నమిఘాట్, నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
గత ఏడాది ఘన విజయానికి కొనసాగింపుగా..
గత ఏడాది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ వైభవంగా నిర్వహించామని ఎమ్మెల్యే గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఈసారి మరింత విస్తృతంగా, ప్రజలను ఆకట్టుకునేలా విజయవాడ ఉత్సవ్ 2.0ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నగర ప్రజలు, భక్తులు, సందర్శకులు కుటుంబ సమేతంగా పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.ఉత్సవాల్లో భాగంగా కళావేదికలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమాలకు భక్తులు, ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. విజయవాడ ఉత్సవ్ 2.0లో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కోరారు.