మదనపల్లె టౌన్,మేజర్ న్యూస్ : లక్ష కోట్ల పెట్టుబడితో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం రాయలసీమ ప్రాంత అభివృద్ధికి శుభసూచకమని టీడీపీ సీనియర్ నాయకులు,మాజీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్.జె వెంకటేష్ పేర్కొన్నారు.ఆదివారం నిమ్మనపల్లి కూడలిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్,కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్,యువమంత్రి నారా లోకేష్,బిజినెస్ టైక్యూన్ అనంత్ అంబానీ ఆధ్వర్యంలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్,ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగిందన్నారు.రాయలసీమతోపాటు నెల్లూరు,ప్రకాశం తదితర ప్రాంతాల్లోనూ విడతల వారీగా ఉద్యాన రంగ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.ఇలాంటి భారీ ప్రాజెక్టుల ద్వారా మదనపల్లె ప్రాంతానికి భవిష్యత్తులో అనేక అవకాశాలు లభిస్తాయన్నారు.వైసీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ చేసిన విమర్శలపై ఆర్.జె వెంకటేష్ స్పందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు.చెట్టు నాటగానే కాయలు కాయవని,భారీ ప్రాజెక్టులకు ప్రణాళిక,అమలు వంటి అనేక దశలు ఉంటాయని,ఫలితాలు రావడానికి సమయం పడుతుందని వివరించారు.గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా మదనపల్లె ప్రాంతానికి రానున్న అవకాశాలను గుర్తించాలని కోరారు.ఈ ప్రాజెక్టును ప్రతి ఒక్కరు స్వాగతించాలన్నారు.ఇటీవల హంద్రీ-నీవా జలాలు,ఇప్పుడు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ తీసుకురావడంలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా సఫలీకృతులయ్యారన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి లోకేష్ బాబు ప్రశంసించడం ఆయన పనితీరుకు నిదర్శనమని కొనియాడారు.అదేవిధంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ బహిరంగ సభను విజయవంతం చేసిన అధికారులు,నాయకులు,కార్యకర్తలు,సచివాలయ సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.