ఏపీలో గృహ నిర్మాణానికి కొత్త శకం..
3డీ టెక్నాలజీతో ఇళ్లు
-ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :
ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ రంగంలో నూతన, వినూత్న శకం ప్రారంభమైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో పీఎంఏవై-జీ 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ద్వారా రాష్ట్రంలో ‘అందరికీ ఇళ్లు’ లక్ష్యం దిశగా కీలక అడుగు పడిందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు.
గ్రామీణ గృహ నిర్మాణంలో 3డీ ప్రింటింగ్
దేశంలో గ్రామీణ గృహ నిర్మాణ రంగంలో తొలిసారిగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేకత అని పవన్ కల్యాణ్ తెలిపారు. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో మొత్తం 177 ఇళ్లను 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ అత్యాధునిక సాంకేతికతతో ఒక్కో ఇంటిని కేవలం 10 రోజుల్లోనే పూర్తి చేసే అవకాశం ఉందన్నారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. సాంకేతికతతో విస్తృతిని, నాణ్యతతో వేగాన్ని, వినూత్న విధానాలతో సంక్షేమాన్ని జోడిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ గృహ నిర్మాణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మద్దతు అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కుటుంబానికి ఒక నీడ, ప్రతి ఇటుకలోనూ ఆధునిక సాంకేతికత, గ్రామీణ ఏపీ అభివృద్ధికి ఒక బలమైన పునాది అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు
3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ద్వారా నిర్మాణ వ్యర్థాలను తగ్గించడంతో పాటు, నిర్మాణ నాణ్యత, సమర్థతను మరింత పెంచవచ్చని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీకి నిరంతరం మద్దతు అందిస్తూ, గ్రామీణ గృహ నిర్మాణంలో వినూత్న విధానాలను ప్రోత్సహిస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.