ఎమ్మెల్యే అమిలినేని కలిసి ఘనంగా సన్మానించిన నూతన జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులు.
కళ్యాణదుర్గం: ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకుని ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టడంతో ఉత్సాహంగా ఉన్న నూతన ప్రజాప్రతినిధులు ఆదివారం ఎమ్మెల్యే స్వగృహానికి చేరుకుని ఆయనతో భేటీ అయ్యారు. కళ్యాణదుర్గం రూరల్ జడ్పీటీసీగా ఎన్నికైన గోళ్ల లక్ష్మీ వెంకటేషులు, కంబదూరు రెబల్ జడ్పీటీసీగా విజయం సాధించిన వేముల శారద, శెట్టూరు జడ్పీటీసీగా ఎన్నికైన ఉరాల రాజేశ్వరి కుమార్‌తో పాటు పలువురు నూతన ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు గజమాలలు వేసి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఎన్నికల్లో తమ విజయానికి సహకరించిన నాయకులు, కార్యకర్తలతో పాటు పార్టీ శ్రేణుల కృషిని ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా పనిచేస్తామని నూతన ప్రజాప్రతినిధులు పేర్కొన్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో సాధించిన విజయంతో బాధ్యత మరింత పెరిగిందని, ప్రజాప్రతినిధులుగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, సాగునీరు తదితర మౌలిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చొరవ చూపాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలందరినీ కలుపుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో కీలకమని, గ్రామస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలోని ఐదు జడ్పీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకోవడంతో పాటు పలు ఎంపీటీసీ స్థానాల్లోనూ విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలో నూతన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో నూతన జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, కూటమి నాయకులు, వివిధ మండలాల పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేను సన్మానించి, ఆయనతో ఫొటోలు దిగుతూ తమ విజయోత్సాహాన్ని పంచుకున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్