నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం.. సొంతింట్లో ఆనందంగా దీపావళి వేడుకలు : సర్పంచ్ చంద్ర భూపాల్ రావు
కుల్కచర్ల, మేజర్ న్యూస్ :తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని సర్పంచ్ చంద్ర భూపాల్ రావు అన్నారు. ముజాహిద్‌పూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న లబ్ధిదారుల కుటుంబాల్లో ఈ ఏడాది దీపావళి పండుగ కొత్త వెలుగులు నింపిందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూసిన పేద కుటుంబాలు తమ సొంత గృహాల్లో దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు సొంతింటి భాగ్యం కలుగుతోందన్నారు. సొంతింటి కల నెరవేరడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోందని తెలిపారు. సొంత ఇంటిలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం తమ జీవితాల్లో మరచిపోలేని అనుభూతి అని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.