ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట వెలుగులు.. సొంతింటి కల సాకారం : సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి
పూడూరు, మేజర్ న్యూస్ :ఇందిరమ్మ ఇళ్ల పథకంతో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయని సొసైటీ చైర్మన్ రఘునాథ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, సొసైటీ వైస్ చైర్మన్ సురేందర్ అన్నారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం పూడూరు మండల కేంద్రంతో పాటు ఎన్కేపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో నూతనంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల వద్ద దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం, దీపావళి పండుగ ఒకేరోజు రావడంతో లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు కలిసి సంబరాలు జరుపుకొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి సొంతింటి భాగ్యం కల్పిస్తామని తెలిపారు. పేదల ఇళ్లలో చిరునవ్వులు వెల్లివిరియడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పూడూరు సర్పంచ్ ఖిజర్ పాషా, మాజీ సర్పంచ్ రామస్వామి, డీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఎన్కేపల్లి కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గోపాల్, మాజీ ఉపసర్పంచ్ నరేందర్, సీతారాములు, సువని, కృష్ణ, యువజన సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.