యోనో ఎస్‌బీఐ సేవలకు తొమ్మిదేళ్లు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: యోనో ఎస్‌బీఐ (YONO SBI) డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభమై తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేక్ కట్ చేసి ఎస్‌బీఐ అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవల ద్వారా ఖాతాదారులకు సులభమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడంలో యోనో ఎస్‌బీఐ కీలక పాత్ర పోషిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఎల్‌డీఎం డేవిడ్ విల్సన్ యోనో ఎస్‌బీఐ ద్వారా అందుబాటులో ఉన్న వివిధ సేవలను వివరించారు. ఏటీఎం కార్డు లేకుండా నగదు ఉపసంహరణ చేసుకునే యోనో క్యాష్, యూపీఐ చెల్లింపులు, ముందస్తుగా ఆమోదించిన వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు దరఖాస్తులు, సంపద నిర్వహణ, బీమా ఉత్పత్తులు, ఫాస్ట్‌ట్యాగ్, మ్యూచువల్ ఫండ్స్, వ్యవసాయ సేవలు, ఆన్‌లైన్ షాపింగ్, యుటిలిటీ బిల్లుల చెల్లింపుల వంటి సదుపాయాలు యోనో యాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. ఖాతాదారులు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకటాచారి, జెడ్పీ సీఈఓ సుధీర్, ఎల్‌డీఎం డేవిడ్ విల్సన్, ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ బాలకృష్ణ, శ్రీధర్, జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.