ఆదాయార్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, మేజర్ న్యూస్:
ప్రజలపై అదనపు పన్నుల భారం మోపకుండా, కొత్తగా ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వ శాఖల ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఆదాయార్జన శాఖలపై బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గడచిన రెండున్నరేళ్లుగా ప్రభుత్వ నిర్ణయాలు, సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, వివిధ ప్రభుత్వ శాఖల్లోని వ్యవస్థలు గాడిలో పడ్డాయని సీఎం అన్నారు. ఆదాయ లీకేజీలను తగ్గించడం, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడంలో పలు శాఖలు మెరుగైన ఫలితాలు సాధించాయని పేర్కొన్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో పారదర్శకత, ఆన్‌లైన్ సేవలు, శాఖాపరమైన సంస్కరణలతో ఆదాయం పెరుగుతోందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ఆదాయంలోనూ ప్రతిఫలించాలని సీఎం చెప్పారు. ప్రతీ వారం ఆదాయ ఆర్జనలపై దృష్టి సారిస్తూ... ఆ మేరకు నివేదికలు సిద్దం చేసుకోవాలని... అవసరమైన మేరకు మార్పులు చేర్పులు చేసుకుంటూ మెరుగైన ఫలితాలు సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ ప్రత్యేక ఏఐ స్టాక్ ద్వారా ఆదాయాలను మెరుగు పర్చుకోవాలని స్పష్టం చేశారు. సమన్వయంతో డేటా లేక్ ద్వారా సమాచారాన్ని విశ్లేషించి ఎక్కడా రెవెన్యూ లీకేజీలు లేకుండా చూడాలన్నారు. 2027 మార్చి నాటికి వంద శాతం వ్యవస్థల్లో మెరుగుదల చూపాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు, స్టాంపులు రిజిస్ట్రేషన్, పురపాలక, పంచాయితీరాజ్, అటవీశాఖల లాంటి ఆదాయార్జన శాఖలు సాంకేతికతను అమలు చేయాలని స్పష్టం చేశారు. నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు వివిధ శాఖల్లో నమోదైన వృద్ధిని నమోదు చేయాలన్నారు. భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు సూచించారు. మద్యం తయారీ నుంచి విక్రయం వరకూ ట్రాకింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు సీఎం దిశానిర్దేశం చేశారు. వాహనాల లోడ్, ఇ-వేబిల్స్ సహా వివిధ అంశాలపై రవాణా శాఖ ఎలక్ట్రానిక్ విధానంలో పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.
వార్షిక లక్ష్యంలో ఇప్పటికే సమకూరిన 58 శాతం ఆదాయం
2026–27 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 23 నాటికి రాష్ట్ర సొంత ఆదాయం రూ.74,342 కోట్లకు చేరిందని అధికారులు సమీక్షలో వివరించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.62,604 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి రూ.11,738 కోట్లు పెరిగి 18.7 శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. రూ.1,27,506 కోట్ల వార్షిక లక్ష్యంలో నవంబర్ 23 నాటికి 58 శాతం సాధించినట్లు వెల్లడించారు. సమీక్షలో వివిధ శాఖల ఆదాయాలపై అధికారులు వివరిస్తూ పన్ను ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో రూ.53,692 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.63,796 కోట్లకు చేరిందని... పన్నుల ద్వారా రూ.10,104 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని... పన్ను ఆదాయంలో 18.8 శాతం, పన్నేతర ఆదాయంలో 31.3 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. వాణిజ్య పన్నుల ఆదాయం 18.3 శాతం వృద్ధితో రూ.5,917 కోట్లు పెరిగి రూ.38,241 కోట్లకు చేరిందని అధికారులు తెలిపారు. ఇందులో జీఎస్టీ ఆదాయం 18.1 శాతం వృద్ధితో రూ.3,694 కోట్లు పెరిగి రూ.24,073 కోట్లకు చేరిందని వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.20,083 కోట్లకు చేరిందని, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.3,287 కోట్లు అదనంగా రావడంతో 19.6 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 16.6 శాతం పెరిగి రూ.8,020 కోట్లకు, వాహన పన్నుల ఆదాయం 17.3 శాతం పెరిగి రూ.3,649 కోట్లకు చేరిందని అధికారులు స్పష్టం చేశారు. గనులు, భూగర్భ శాఖ ఆదాయం 13.2 శాతం వృద్ధితో రూ.2,086 కోట్లకు, అటవీ శాఖ ఆదాయం 22.3 శాతం వృద్ధితో రూ.22 కోట్లకు చేరిందని అన్నారు. పన్నేతర ఆదాయం రూ.1,330 కోట్ల నుంచి రూ.2,091 కోట్లకు పెరిగిందని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను వసూళ్లకు ఏఐ
ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 20 వరకు పంచాయతీలకు సుమారు రూ.239 కోట్ల పన్ను ఆదాయం వచ్చిందని, ఇదే కాలంలో పట్టణ స్థానిక సంస్థలకు సుమారు రూ.2,366 కోట్ల పన్ను ఆదాయం వచ్చిందని అధికారులు సమీక్షలో వివరించారు. ఆస్తిపన్ను వసూళ్లను మెరుగుపర్చేందుకు 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఏఐ ఆధారిత వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పన్ను రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలు, న్యాయ వ్యవహారాల్లో ఏఐని వినియోగిస్తున్నట్లు వివరించారు. పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో గత ఏడాది రూ.1,015 కోట్ల పన్నుల్ని డిజిటల్ గానే వసూలు చేసినట్టు అధికారులు తెలియచేశారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, గనులు, రవాణా, పురపాలక, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.