ప్రజల మద్దతుతో చంద్రబాబు సాధించిన విజయాన్ని చీకటి గెలుపు అంటారా? సాక్షిది నాలుకా.. తాటిమట్టా!
అమరావతి, మేజర్‌న్యూస్ :
చంద్రబాబుది ‘చీకటి గెలుపు’ అంటూ సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ... “ప్రజల మద్దతుతో వరుస విజయాలు సాధిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గెలుపును సాక్షి పత్రిక 'చీకటి గెలుపు' అంటూ అభివర్ణించడం దుర్మార్గం. అసలు సాక్షిది నాలుకా.. తాటిమట్టా? ఒళ్లు తెలియకుండా మాట్లాడుతున్నారా? ఏడు దఫాలుగా అప్రతిహతంగా, ప్రతి ఎన్నికలోనూ 50 వేలకు పైగా మెజారిటీతో చంద్రబాబు గారు విజయం సాధిస్తున్నారు. కుప్పం ప్రజలు ప్రతి ఎన్నికలోనూ ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన కుప్పం నియోజకవర్గం నేడు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో అభివృద్ధిలో పోటీపడుతోంది. అలాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడి విజయాన్ని చీకటి గెలుపు అనడం జగన్‌కు తగునా? 151 అసెంబ్లీ స్థానాలు ఇచ్చి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలే.. 'నువ్వు మాకొద్దు బాబూ' అంటూ జగన్‌ను 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సింది పోయి, ఇప్పుడు అదే ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా జగన్ వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా జరిగి రెండున్నరేళ్లు గడుస్తున్నా, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ప్రజల మద్దతు లభించడం లేదు. జగన్‌ను మరోసారి అధికారంలో చూడటానికి ప్రజలు సిద్ధంగా లేరన్నది స్పష్టమవుతోంది. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు గారి విజయాన్ని, ప్రజల తీర్పును అవమానించేలా తన రోత పత్రికలో రోత రాతలు రాయిస్తున్నారు. భారతదేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు గారిపై ఇలాంటి విషప్రచారం చేయించడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం. చంద్రబాబు గారిని కించపరచడమంటే సూర్యుడిపై ఉమ్మి వేయడమే. అలా చేస్తే అది తిరిగి ఉమ్మి వేసిన వారిపైనే పడుతుంది. ఈ విషయాన్ని సాక్షి యాజమాన్యం గుర్తుంచుకోవాలి. చంద్రబాబు గారు 'శ్రీరామ' అని అంటే, ఆయన బూతులు మాట్లాడుతున్నారంటూ వక్రీకరించే స్థాయికి సాక్షి పత్రిక దిగజారిపోయింది. వాస్తవాలను ప్రజలకు అందించడం కంటే చంద్రబాబును ఆక్షేపించడం, తప్పుబట్టడం, కించపరచడమే లక్ష్యంగా సాక్షి పనిచేస్తోంది. 'రిపోర్టర్స్ కలెక్టివ్' అనే కొంతమంది విలేకరుల బృందం పోలింగ్ రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు వచ్చిన వారికి స్లిప్పులు పంపిణీ చేస్తారని, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నిబంధనల్లో వ్యత్యాసం ఉంటుందని ఒక కథనం ప్రచురించింది. దానిని కూడా వక్రీకరించి చంద్రబాబు గారిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నివేదికలోని అంశాలను తమకు అనుకూలంగా మలుచుకుని తప్పుడు ప్రచారం చేయడం సాక్షి పత్రికకు అలవాటుగా మారింది. ప్రజాభిప్రాయం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. అదే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. పోలింగ్ రోజున ఏవైనా అక్రమాలు జరిగితే అక్కడున్న ఎన్నికల ఏజెంట్ లేదా పోలింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయాలి. ఫారం 17C అందించిన తర్వాత, సంతకాలు పూర్తయిన తర్వాత, కౌంటింగ్ కూడా ముగిసిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడంలో అర్థం లేదు. చంద్రబాబుపై ఉన్న అక్కసుతోనే ఈ కథనాలు రాస్తున్నారు తప్ప, వాటిలో ఎలాంటి వాస్తవం లేదు. ఈ ఆరోపణలకు చట్టపరమైన ప్రామాణికత లేదని సీనియర్ న్యాయవాదులు సైతం స్పష్టం చేస్తున్నారు. రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే వైసీపీ ఘోర పరాజయాలను చవిచూస్తోంది. ఉట్టికెక్కలేనివాడు స్వర్గానికి ఎక్కుతానన్నట్లుగా జగన్ పరిస్థితి ఉంది. ప్రజల మద్దతు లేదన్న భయంతోనే చంద్రబాబు గారి విజయంపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయిస్తూ, ప్రజల తీర్పును తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నారు” అని పేర్కొన్నారు.