telangana
వృత్తి నైపుణ్య శిక్షణకు అర్హులైన ఫ్యాకల్టీ ఎంపిక
సూర్య, మందమర్రి : స్థానిక నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యాలను అందించి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో సింగరేణి సేవా సమితి నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు కొత్త శిక్షకులను ఎంపిక చేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల ఫ్యాకల్టీ నియామకంలో భాగంగా సోమవారం మందమర్రి ఏరియా జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ శిక్షణ విభాగాల్లో మొత్తం ఆరు కోర్సులు, కేంద్రాలకు శిక్షకులను నియమించేందుకు ఈ ప్రక్రియ చేపట్టారు. ఆయా పోస్టుల కోసం 18 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారి అర్హతలు, నైపుణ్యాలను పరిశీలిస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్ మాట్లాడుతూ, సింగరేణి సేవా సమితి ద్వారా ప్రతి ఏటా నిర్వహిస్తున్న వృత్తి శిక్షణ కార్యక్రమాలు ఎంతోమంది స్థానికులకు ఉపాధి మార్గాలను చూపుతున్నాయని అన్నారు. శిక్షణ పొందిన వారు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని సాధించి స్వయం ఉపాధి పొందేందుకు ఈ కోర్సులు దోహదపడుతున్నాయని వివరించారు. ఈ ఏడాదికి ఫ్యాకల్టీ ఎంపికను పారదర్శకంగా పూర్తి చేశామని, ఎంపికైన ఆరుగురు అభ్యర్థులు త్వరలో ప్రారంభమయ్యే తరగతుల్లో శిక్షకులుగా బాధ్యతలు చేపడతారని తెలిపారు. ఈ ఇంటర్వ్యూల నిర్వహణలో ఎస్‌ఓ టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏజీఎం (ఎఫ్ అండ్ ఏ) ఆర్.వి.ఎస్.ఆర్.కె. ప్రసాద్, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, డీజీఎం (ఐఈడీ) కిరణ్ కుమార్, సీనియర్ పీవో ఆర్. సత్యనారాయణ పాల్గొన్నారు.