పండుగ సీజన్లో దూసుకెళ్లిన ఈవీ విక్రయాలు
సూర్య బిజినెస్ డెస్క్: దేశీయ ఆటోమొబైల్ రంగంలో 2026 పండుగ సీజన్ సందర్భంగా మొత్తం వాహన రిటైల్ విక్రయాలు 2.21 శాతం వృద్ధితో 55,25,490 యూనిట్లకు చేరుకున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే పండుగ కాలంలో నమోదైన 54,05,956 యూనిట్లతో పోలిస్తే ఈసారి అమ్మకాలు పెరిగినప్పటికీ, ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు మాత్రం 7.16 శాతం తగ్గాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు మాత్రం 52.62 శాతం భారీ వృద్ధి సాధించి, ఒకే పండుగ సీజన్లో తొలిసారిగా ఐదు లక్షల మైలురాయిని అధిగమించడం విశేషంగా నిలిచింది.
ఫాడా గణాంకాల ప్రకారం ప్యాసింజర్ వాహనాల విక్రయాలు గత పండుగ కాలంలోని 8,06,322 యూనిట్ల నుంచి ఈసారి 7,48,616 యూనిట్లకు తగ్గాయి. మరోవైపు ద్విచక్ర వాహనాల రిటైల్ అమ్మకాలు 3.67 శాతం పెరిగి 43,13,276 యూనిట్లకు చేరుకోగా, త్రిచక్ర వాహనాల విక్రయాలు 5.32 శాతం వృద్ధితో 1,93,576 యూనిట్లుగా నమోదయ్యాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 7.13 శాతం పెరిగి 1,55,761 యూనిట్లకు చేరుకోగా, నిర్మాణ పరికరాల విక్రయాలు 26.06 శాతం దూసుకెళ్లాయి. ట్రాక్టర్ల రిటైల్ విక్రయాలు కూడా 2.24 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
నవరాత్రుల సమయంలో గత ఏడాది గణాంకాల ప్రభావంతో అమ్మకాలు కొంత నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, ధనత్రయోదశి మరియు దీపావళి సమయానికి డిమాండ్ జోరందుకుందని ఫాడా అధ్యక్షుడు సాయి గిరిధర్ తెలిపారు. నవరాత్రి సమయంలో 18 శాతానికి పైగా క్షీణించిన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు, పండుగ సీజన్ ముగిసే నాటికి లోటును సగానికి తగ్గించుకోగలిగాయని ఆయన పేర్కొన్నారు. నవరాత్రులలో ప్రతికూల వృద్ధిలో ఉన్న మొత్తం ఆటోమొబైల్ మార్కెట్, పండుగ సీజన్ మొత్తం మీద సానుకూల వృద్ధిలోకి వచ్చిందని వివరించారు.
ఈ పండుగ సీజన్లో ఎలక్ట్రిక్ వాహన విభాగం కీలక వృద్ధి చోదకంగా నిలిచింది. క్రితం ఏడాది పండుగ కాలంలో 3,33,935 యూనిట్లుగా ఉన్న మొత్తం ఈవీ రిటైల్ అమ్మకాలు ఈసారి 52.62 శాతం పెరిగి 5,09,667 యూనిట్లకు చేరుకున్నాయి. ఎలక్ట్రిక్ టూవీలర్ విక్రయాలు 61.10 శాతం వృద్ధితో 3,30,846 యూనిట్లకు, ఎలక్ట్రిక్ త్రీవీలర్ అమ్మకాలు 25.45 శాతం పెరిగి 1,20,330 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు గత ఏడాది 30,133 యూనిట్ల నుంచి ఈసారి 72.91 శాతం పెరిగి 52,104 యూనిట్లకు చేరగా, ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల అమ్మకాలు ఏకంగా 154.56 శాతం పెరిగి 6,387 యూనిట్లుగా నమోదయ్యాయి. పండుగ సీజన్లో అమ్ముడైన ప్రతి పది వాహనాలలో దాదాపు ఒకటి ఎలక్ట్రిక్ వాహనమే కావడం వినియోగదారులలో ఈవీల పట్ల పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని సాయి గిరిధర్ పేర్కొన్నారు.