విద్యార్థులు పరిశోధన నైపుణ్యాభివృద్ధి సాధించాలి-
పాలమూరు యూనివర్సిటీ మేజర్ న్యూస్-
పాలమూరు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో బి.ఫార్మసీ ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం శుక్రవారం ఫార్మసీ ఆడిటోరియంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు ఫార్మసీ విద్యను కేవలం ఉద్యోగ అవకాశాలకే పరిమితం చేయకుండా పరిశోధన, నూతన ఆవిష్కరణల దిశగా తమ ఆలోచనలను విస్తరించాలని సూచించారు. ఔషధ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. క్రమశిక్షణ, నిరంతర అధ్యయనం, నైపుణ్యాభివృద్ధితో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశోధనలకు అవసరమైన అవకాశాలను కల్పించేందుకు యూనివర్సిటీ కృషి చేస్తోందని తెలిపారు.అతిథిగా పాల్గొన్న యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో ప్రథమ సంవత్సరం ఎంతో కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారిస్తూ, అధ్యాపకుల మార్గదర్శకత్వంలో తమ ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.ప్రొఫెసర్ ఎం. సునీతా రెడ్డి మాట్లాడుతూ, ఫార్మసీ విద్యలో సైద్ధాంతిక పరిజ్ఞానంతో పాటు ప్రయోగాత్మక నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని వివరించారు. ఔషధాల తయారీ, నాణ్యత నియంత్రణ, ఔషధ పరిశోధన, క్లినికల్ ఫార్మసీ తదితర రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు పరిశోధనాత్మక దృక్పథాన్ని అలవర్చుకొని, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఫార్మసీ విద్య ప్రాధాన్యత, ఉన్నత విద్య, పరిశోధన, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. ఈశ్వర్ కుమార్, డాక్టర్ వి. ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ తరుణ్, డాక్టర్ పి. సైలస్, డాక్టర్ కె. సోమేశ్వర్, డాక్టర్ జి. చిన్నదేవి, డాక్టర్ సి.హెచ్. రవికాంత్, డాక్టర్ ఎన్. శారద, డాక్టర్ సుస్మిత, డాక్టర్ స్వాతి, డాక్టర్ సుజాత, ఇతర అధ్యాపకులు, సిబ్బంది, బి.ఫార్మసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.
ఎం .ఓం ప్రకాష్ -పాలమూరు యూనివర్సిటి,మహబూబ్ నగర్