విద్యా విధానాల అధ్యయనానికి గుజరాత్‌కు ట్రస్మా బృందం
సూర్య నస్పూర్ : తెలంగాణలో ప్రతిపాదిత 10+2 విద్యా విధానం అమలు, ప్రయోజనాలు, సవాళ్లను అధ్యయనం చేసేందుకు ట్రస్మా మంచిర్యాల జిల్లా బృందం గుజరాత్ రాష్ట్రానికి విద్యా అధ్యయన యాత్ర చేపట్టింది. జిల్లాలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన సుమారు 40 మంది కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు సోమవారం రాత్రి మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరారు.
ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ, గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఏకలవ్య పాఠశాలతో పాటు పలు ప్రముఖ విద్యాసంస్థలను నాలుగు రోజులపాటు సందర్శించి, అక్కడి బోధనా పద్ధతులు, డిజిటల్ తరగతి గదులు, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తామన్నారు. ప్రతిపాదిత 10+2 విద్యా విధానంతో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు, పాఠశాలలపై ప్రభావం, మౌలిక వసతుల అవసరాలు, చిన్న, మధ్యతరహా ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొనే సమస్యలను అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను గుర్తించి జిల్లాలో అమలు చేయడంతో పాటు, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు అందించేందుకు అధ్యయన యాత్ర దోహదపడుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టినట్లు పేర్కొన్నారు.