విద్య, విజ్ఞానంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి.. కంబాలపల్లి భాస్కర్
మంచాల : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ప్రజాసంఘాల అధ్యక్షులు కంబాలపల్లి భాస్కర్ చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞానం, ఆటపాటల్లోనూ ముందుండాలని ఆకాంక్షించారు. విద్య అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం చూపుతుందని పేర్కొన్నారు. విద్యార్థులంతా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలా కలిసిమెలిసి మెలగాలని, పరస్పర సహకారం, ఐక్యతతో మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. గ్రామానికి మాత్రమే కాకుండా దేశానికి మంచి పేరు తీసుకొచ్చే విద్యావేత్తలుగా, గౌరవప్రదమైన స్థానాల్లో ఎదగాలని ఆకాంక్షించారు. బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ ఆశించిన విధంగా పిల్లలంతా ప్రేమ, స్నేహభావం, ఐక్యతతో ముందుకు సాగాలని అన్నారు. సమానత్వం, సోదరభావంతో కూడిన సమసమాజ నిర్మాణంలో భావి పౌరులుగా భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
✍️ఎర్ర లింగం మేజర్ న్యూస్, మంచాల